ఒక హీరో నంబర్ -1 అవ్వడం అంటే ఏంటి? అప్పటికే అగ్ర హీరోలుగా ఏలిన వారి నిర్మాతల నుంచి గుర్తింపు పొందడం లేదా వారి నుంచి పెట్టుబడుల్ని రాబట్టుకోవడం.. తనవైపు మళ్లించుకోవడం! ఫలానా హీరోకి పెట్టాల్సిన సొమ్మును ఈ హీరోకి తరలించుకోవడం..!
అయితే జమానా కాలంలో అంతగా డ్యాన్సులు, ఫైట్స్ అంటే ఏమిటో తెలీని రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి ఆరంగేట్రం సినీపరిశ్రమలో పెను విధ్వంశానికి దారి తీసింది. చిరంజీవి డ్యాన్సులు చూసేందుకు జనం థియేటర్లపై ఎగబడటం మొదలైంది. ఆరోజుల్లో `ఖైదీ` లాంటి సినిమాతో అలాంటి సంచలనం సృష్టించారు చిరు. సుప్రీంహీరోగా, మెగాస్టార్‌గా ఎదిగారు.
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి లెజెండ్స్ చిరంజీవి అనే కమర్షియల్ హీరో గురించి ప్రశంసించిన సందర్భాలున్నాయి. ఆసక్తికరంగా ఈ లెజెండరీ హీరోలతో సినిమాలు నిర్మించిన చాలా మంది ప్రముఖ నిర్మాతలు చిరంజీవిలోని ప్రతిభకు ఫిదా అయిపోయి ఆయన సెట్స్ కి వచ్చి అక్కడ మీటింగులు పెట్టేవారు. సాయంత్రం పూట స్కాక్స్ తింటూ కాలక్షేపంగా కబుర్లు చెప్పుకునేవారు. అలా తన సెట్స్ కి వచ్చిన నిర్మాతల్ని చిరంజీవి ఎంతగానో గౌరవించి ఆదరించేవారు. ఆరోజు అనుకున్నారట చిరంజీవి. నంబర్ వన్ గా ఎదగడం అంటే ఇదే కదా! అంత పెద్ద హీరోల నిర్మాతలు తన సెట్స్ కి వచ్చి తనతో కాలక్షేపం చేస్తున్నారంటే తాను కోరుకున్నది ఇదే కదా! వీళ్లే కదా నా బలం అని అనుకున్నారట.
ఇటీవల ఓ మీటింగ్ లో చిరంజీవి దీనిని గుర్తు చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారి నిర్మాతలు దేవీ ప్రసాద్ గారు, చలసాని గోపి గారు, త్రివిక్రమ్ గారు, ఏడిద నాగేశ్వరరావు గారు... అంతటి నిష్ణాతులైన నిర్మాతలు అంతా నా షూటింగ్ లొకేషన్ కి వచ్చి సాయంత్రం స్నాక్స్ తినేవారు.. నేను కోరుకున్నది ఇదే అని తెలిపారు. అయితే తాను నంబర్ వన్ అయ్యానని గర్వంతో కాలర్ ఎగరేయలేదని, ఒదిగి ఉండటం నేర్చుకున్నానని కూడా చిరు తెలిపారు. కష్టే ఫలి సూత్రాన్ని నమ్మి తాను ఎప్పటికీ కష్టపడి తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగానని కొంత గర్వంగానే చెప్పుకొచ్చారు.