బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దుండగుడి కత్తిపోట్ల వ్యవహారంలో విచారణ ఎంతవరకూ వచ్చింది? అంటే.. ఇది ఇంకా కోర్టు విచారణ దశలోనే ఉంది. ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న విషయాలు ఇప్పటికి బయటికి వచ్చాయి. బంగ్లాదేశీ యువకుడు మహమ్మద్ షరీఫుల్ కేవలం రూ.30,000 కోసం సైఫ్ పై పదే పదే కత్తిపోట్లు పొడిచాడని పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇండియాలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సంపాదిస్తే ఏ దేశానికి అయినా సులువుగా వర్క్ వీసా దొరుకుతుందని, ఇక్కడ ఆ రెండూ పొందాలంటే 30వేలు కావాలని, అందుకే దొంగతనానికి ప్రయత్నించానని అతడు పోలీసులకు చెప్పడంతో వారంతా నిర్ఘాంతపోయారు.
అతడు సైఫ్ ఇంట్లోకి జొరబడ్డాక భయపడిన నానీ (పనిమనిషి) ముందు కోటి డిమాండ్ చేసాడు. లేదంటే చంపేస్తానని బెదిరించాడు. అయితే అప్పటికే సైఫ్ ఖాన్ అతడిని పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేసాడు. దీంతో అతడు పదే పదే కత్తిపోట్లు పొడిచాడు. కానీ సైఫ్ అతడిని ఒక గదిలోకి నెట్టి తాళం వేసాడు. ఆ గదిలో కిటికీ గుండా తాను తప్పించుకున్నాని షెహజాద్ పోలీసులకు చెప్పాడు. మొత్తానికి ఛార్జ్ షీట్ ప్రకారం.. అతడు కేవలం దొంగతనం కోసం మాత్రమే సైఫ్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడు.
అయితే ఈ కేసు ప్రారంభంలో భర్త సైఫ్ పై భార్య కరీనా కపూర్ ఈ దాడి చేయించిందని, అతడిని లేపేస్తే వేల కోట్ల ఆస్తులు తన పరం అవుతాయని ఆశించిందని మీడియాలో కథనాలొచ్చాయి. అలాగే తన పనిమనిషితో ఎఫైర్ ఉండటంతో కక్ష కట్టి మరీ కరీనా అతడిని చంపించేందుకే ఇలా ప్లాన్ చేసిందని కూడా మీడియా కథనాలు వండి వార్చింది. అయితే పోలీసుల ఛార్జ్ షీట్‌లో వెర్షన్ చూస్తుంటే మీడియా నిరాధార కట్టుకథలు రాసిందని అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి సైఫ్ కేసులో కొండను తవ్వి పోలీసులు ఎలుకను పట్టారు!