సినిమా ఇండస్ట్రీలో హీరో-హీరోయిన్స్ మధ్యన పారితోషికం అనే తారతమ్యాన్ని చాలామంది హీరోయిన్స్ తప్పుపడుతున్నారు. హీరోయిన్స్ గా ఓ స్టేటస్ వచ్చాక ఈ హీరో, హీరోయిన్స్ నడుమ రెమ్యునరేషన్ తారతమ్యాల గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. సమంత, రకుల్, పూజ హెగ్డే లాంటి చాలామంది హీరోయిన్స్ హీరోలతో సమానంగా హీరోయిన్స్ కష్టపడుతున్నారు, కానీ పారితోషికం విషయంలో మాత్రం అందరికి సమానంగా రావడం లేదు అంటున్నారు.
తాజాగా సమంత నిర్మాతగా కూడా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసింది. ఆమె హీరో-హీరోయిన్ పారితోషికాల తరతమ్యాలపై మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను చాలా సినిమాల్లో నటించాను, హీరోలైనా-హీరోయిన్లయినా ఇద్దరూ ఒకేలా కష్టపడతారు. కానీ వారికి ఇచ్చే రెమ్యూనరేషన్లలో మాత్రం చాలా తేడా ఉంటుంది. సమానమైన డిమాండ్ ఉన్న పాత్రలు చేసినప్పటికీ పారితోషకం విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
సినిమా ఇండస్ట్రీలో నన్ను ఇబ్బందిపెట్టే విషయమే అది. అందుకే నేను దీన్ని మార్చాలనుకుంటున్నాను, నాతోనే మార్పు మొదలు పెట్టాలనుకుంటున్నాను. గతాన్ని నేను ఎలానూ మార్చలేను, నేను నా సినిమాలో నటించే నటీనటులకు సమానమైన పారితోషికం ఇస్తున్నాను. అలా అని నేను పురుషులు-మహిళలు సమానం అని పోరాడడం లేదు. కానీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని మాట్లాడుతున్నాను. అంతేతప్ప నాకింత ఇవ్వమని నేను డిమాండ్ చెయ్యను అంటూ సమంత చెప్పుకొచ్చింది.