ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ డివైడ్ తర్వాత సినీపరిశ్రమ ఏపీకి తరలిపోవడం ఖాయమన్న చర్చ సాగింది. కానీ దశాబ్ధం గడిచినా ఎలాంటి తరలింపు లేకపోవడం ఏపీకి అతిపెద్ద నిరశ. ఏపీకి రాజధాని లేదు.. గ్లామర్ అసలే లేకుండా పోయిందన్న ఆవేదన యూత్ లో ఉంది. ఇదిలా ఉంటే అప్పుడప్పుడు వచ్చిపోయే చుట్టాల్లా మంత్రులు, కొందరు సినీ హీరోలు ఏపీకి సినీపరిశ్రమను తరలిస్తున్నామని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక రొటీన్ ప్రకటన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నుంచి వెలువడడం నీరసం పుట్టించింది.
సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ఏపీకి సినీపరిశ్రమను తరలించాల్సి ఉందని అన్నారు. దీనికోసం ఒక ప్రత్యేకమైన పాలసీని తెస్తామని, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏపీలో సినీపరిశ్రమ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నారని ప్రకటించారు. అంతేకాదు.. ఏపీలో సినీ స్టూడియోలు నిరుపయోగంగా ఉన్నాయని, ఇక్కడ షూటింగులు చేసేవారికి ప్రత్యేక రాయితీలు అందిస్తామని వెల్లడించారు. ఏపీలో రికార్డింగ్ స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోలు, షూటింగుల కోసం భారీ స్టూడియోల సెటప్ లాంటి వాటిని ఏర్పాటు చేసే ప్రయివేటు సంస్థలకు రాయితీలు కల్పించే దిశగా చర్యలు తీసుకోనుందని త్వరలోనే పాలసీని రిలీజ్ చేస్తామని మంత్రి కందుల వెల్లడించారు. అయితే ఇది నిజమా?
ప్రకటనలు ఘనం.. పనులు శూన్యం! అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ప్రకటనలు గతంలో ఎన్నో వెలువడ్డాయి. అసలు ఏపీలో ఎఫ్.డి.సి ఉందో లేదో పని చేస్తోందో లేదో కూడా ఎవరికీ సరిగా తెలీదు. అసలు ఏపీలో సినీపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేస్తోందో ఎలాంటి స్పష్ఠతా లేదు. అప్పుడప్పుడు కొన్ని గాలి ప్రకటనలతో ఎలాంటి ప్రయోజనం లేదనే నిరాశ యూత్ లో అలానే ఉంది.