స్టంట్ కొరియోగ్రఫీ అనేది అత్యంత క్లిష్ఠమైన విభాగం. సినిమా 24 శాఖల్లో రిస్కులు ఎక్కువ ఉండేది ఈ విభాగానికే. సినిమాకి భారీతనం తెచ్చేది... ప్రేక్షకుడిని కుర్చీ అంచుకు జారేలా లాగేవి స్టంట్స్. ప్రమాదకర స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేస్తూ ఎందరో కొరియోగ్రాఫర్లు మరణించిన సందర్భాలున్నాయి. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ టాలీవుడ్ వరకూ ప్రమాదాల్లో గాయపడి ప్రాణాల మీదికి తెచ్చుకున్నవారు ఉన్నారు.
అయితే ఇంత రిస్క్ చేసినా ఈ విభాగానికి ఇన్నాళ్లు సరైన గుర్తింపు లేదు. ఎట్టకేలకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ అవార్డ్స్ లో ఈ విభాగానికి గుర్తింపు దక్కనుంది. ఇకపై స్టంట్ కొరియోగ్రాఫర్లకు పురస్కారాల్ని అందించనుంది అకాడెమీ. ఆ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. 2027 లో తెరకెక్కిన సినిమాలకు 2028లో ఆస్కార్స్ లో స్టంట్స్ విభాగంలో పురస్కారాల్ని అందిస్తారు. విదేశీ కేటగిరీలో మన దేశం నుంచి సినిమాలను కూడా ఈ విభాగంలో పోటీకి పంపుకోవచ్చు. ఆస్కార్స్ ప్రారంభమై 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వందో ఈవెంట్లో స్టంట్స్ విభాగానికి ఈ గుర్తింపును కల్పిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది.
టాలీవుడ్ ఇటీవల హాలీవుడ్ రేంజులో స్టంట్స్ కొరియోగ్రఫీపై దృష్టి సారిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ దీనికి ఉదాహరణ. ఇకపైనా రాజమౌళి- మహేష్ సినిమా, అల్లు అర్జున్- అట్లీ సినిమా, ప్రశాంత్ నీల్ - సలార్ 2, నాగ్ అశ్విన్ కల్కి 2898 సీక్వెల్ హాలీవుడ్ స్టాండార్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటాయనడంలో సందేహం లేదు. అలాంటి భారీ చిత్రాలను విదేశీ కేటగిరీలో స్టంట్స్ పురస్కారాల కోసం ఆస్కార్స్ కి పంపే వీలుంటుంది.