దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ `క్రిష్ 4` గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హృతిక్ రోషన్ మెగా ఫోన్ పడుతున్నారు. భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని విజువల్ ఫీస్ట్ ని అందించేందుకు యష్ రాజ్ ఫిలింస్ తో హృతిక్ - రాకేష్ రోషన్ బృందం జత కట్టడం ఆసక్తిని రేకెత్తించింది. ఈసారి క్రిష్ ఫ్రాంఛైజీలో నాలుగో భాగానికి తాను దర్శకత్వం వహించబోనని, తనయుడు హృతిక్ దర్శకుడిగా పరిచయమవుతాడని క్రిష్ ఫ్రాంఛైజీ చిత్రాల నిర్మాత రాకేష్ రోషన్ అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ సినిమాపై మరింత ఉత్కంఠ పెరిగింది.
తాజాగా అందిన సమాచారం మేరకు.. హృతిక్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. హీరోగా, హీరో తండ్రిగా, విలన్ గా కూడా అతడిని తెరపై చూసేందుకు ఆస్కారం ఉందని బాలీవుడ్ మీడియా కథనాలు వెలువరించింది. అంతేకాదు ఈ చిత్రంలో రేఖ, ప్రీతి జింతా, ప్రియాంక చోప్రా పాత్రలు తిరిగి తెరపైకి వస్తాయి. అలాగే నోరా ఫతేహి యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో కనిపిస్తుందని గుసగుస వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ సాగుతోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళతారని తెలుస్తోంది. ఈ సినిమాని హాలీవుడ్ రేంజు కథతో రూపొందించనున్నారని కూడా తెలుస్తోంది. దానికోసం భారీగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ ని ఉపయోగించనున్నారు.
అయితే ఈ సినిమా కోసం హృతిక్ చాలా పెద్ద సాహసం చేస్తున్నారని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. మూడు పాత్రలు పోషిస్తూ, 1000 కోట్ల బడ్జెట్ సినిమాకి దర్శకత్వం వహించడం అంటే ఆషామాషీ కాదు. తొలి ప్రయత్నంలో ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. బహుహుఖ ప్రజ్ఞావంతుడే అయినా, అంత సులువైన విషయం కాదు. కానీ హృతిక్ రోషన్ బహుముఖ పాత్రల్ని సమర్థంగా పోషించాలని ఆశిద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి హృతిక్ నటించిన పాన్ ఇండియన్ మూవీ `వార్ 2` ఆగస్టులో విడుదల కానున్న సంగతి తెలిసిందే.