మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లను అందించినా, ఇటీవల ఫ్లాపులతో గ్రాఫ్ డౌన్ ఫాల్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా అతడి సినిమాల్లో కంటెంట్ గురించి, అతడి లుక్ గురించి చాలా కామెంట్లు వినిపిస్తున్నాయి. ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ వంటి సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం అతడి గ్రాఫ్‌ని తగ్గించింది. ప్రస్తుతం అతడు తన కెరీర్ 75వ సినిమా `మాస్ జాతర`ను రిలీజ్ కి రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా అందిన సమాచారం మేరకు.. కిషోర్ తిరుమల దర్శకత్వంలోని సినిమాని పట్టాలెక్కించేందుకు రవితేజ సిద్ధమవుతున్నాడని తెలిసింది. నేను శైలజ, రెడ్, ఉన్నది ఒకటే జిందగీ లాంటి చిత్రాల్ని తెరకెక్కించిన కిషోర్ తిరుమల మాస్ రాజా బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథాంశాన్ని ఓకే చేయించాడని తెలుస్తోంది. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి శుభ సందర్భంగా ఈ చిత్రం అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. రవితేజ జూలై 2025లో రిలీజ్ కి రానున్న `మాస్ జతార`ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తదుపరి కిషోర్ తిరుమలతో సెట్స్ పైకి వెళతాడు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న రవితేజ ఎంపికలు ఇటీవల విస్త్రతంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. పాన్ ఇండియన్ కల్చర్ ఉధృతంగా ఉంది. అందుకు తగ్గట్టు యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశాలను ఎంపిక చేసి భారీ ప్రణాళికలతో బరిలో దిగాల్సిన పరిస్థితి ఉంది. రవితేజ పెద్ద బడ్జెట్లతో గతంలో అలాంటి ప్రయత్నాలు చేసినా దర్శకులు అతడిని నిండా ముంచారు. స్క్రిప్టుల పరంగాను అంత డెప్త్ లేకపోవడం కూడా ఈ పరాజయాలకు కారణం అనేది అతడు విశ్లేషించుకున్నాడు.
రొటీనిటీ ఇప్పుడు జనాలకు ఎక్కడం లేదు. ఏదైనా కొత్తగా చాలా ప్రత్యేకంగా ఉన్న కంటెంట్ మాత్రమే ఎక్కుతోంది. సమకాలీన ప్రపంచంలోని సమస్యలను, భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించడంలో విజయం సాధిస్తేనే సినిమా హిట్టవుతోంది. లేదా రొటీన్ కి భిన్నంగా ఒక కొత్త ప్రపంచాన్ని టచ్ చేసినా అది ప్రజలకు కనెక్ట్ అవుతోంది. ఓటీటీలు, డిజిటల్ కంటెంట్ డామినేషన్ నడుమ మునుపటిలా పాత కథల్ని తిప్పి తీస్తే, పప్పులు ఉడకడం లేదు. రవితేజ ఇండస్ట్రీలో ప్రభావవంతమైన సీనియర్ హీరో. అతడి తదుపరి ఎంపికలు అతడి దశ దిశను నిర్ణయించనున్నాయి. మాస్ జాతర తర్వాత కిషోర్ తో అతడి ప్రయత్నం ఎలా ఉంటుందో వేచి చూడాలి. మాస్ రాజా గ్రేట్ కంబ్యాక్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు సరైన బ్లాక్ బస్టర్ ఇస్తాడనే ఆశిద్దాం.