ఇకపై థియేటర్లలో మద్యం సేవించడానికి మల్టీప్లెక్సులు అనుమతించనున్నాయి. ఆ మేరకు పీవీఆర్ ఐనాక్స్ కొత్త బిజినెస్ ఫార్మాట్‌ని సిద్ధం చేస్తోందని సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని పీవీఆర్ థియేటర్లలో ఆల్కహాల్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. వాటర్ బాటిల్, కోలాలు కొనుక్కున్నంత సులువుగా ఇకపై ఆల్కహాల్ కొనుక్కుని తాగొచ్చు.
బెంగళూరు, గుర్ గావ్ సహా పలు మెట్రో నగరాల్లో పీవీఆర్ చైన్ థియేటర్లలో మద్యం విక్రయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనికోసం లైసెన్సులు మంజూరీ కోసం మాల్స్ యాజమాన్యాలు దరఖాస్తులు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే థియేటర్లలో మద్యం మత్తు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఊహిస్తేనే దడ పుడుతోంది.
మనిషి మామూలుగానే ప్రమాదకారి. కిక్కు ఎక్కితే పుట్టుకొచ్చే ప్రమాదాలు ఎలా ఉంటాయో ఊహకే అందవు. చీకటి థియేటర్‌లో ముఖ్యంగా పిల్లలతో సినిమా చూడటానికి వచ్చిన ఫ్యామిలీ ఆడియెన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలం. తాగి వాసన వస్తుంటే అతడి పక్కనే కూచుని మహిళలు, చిన్న పిల్లలు సినిమా చూడగలరా? యథేచ్ఛగా మద్యం సేవించి ఇష్టానుసారం ప్రవర్తించే నరమానవులతో థియేటర్లలో చిక్కులు తలెత్తవా? అధిక టికెట్ ధర, జేబుకు చిల్లు పెట్టే కోలాలు పాప్ కార్న్ ధరలకు ఇప్పుడు ఆల్కహాల్ ధరలు అదనపు భారంగా మారకుండా ఉంటాయా? యూత్ ని పిల్లలను ఈ కల్చర్ చెడగొట్టకుండా ఉంటుందా? మల్టీప్లెక్స్ యాజమాన్యాల ధనదాహానికి ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తాయోననే ఆందోళన నెటిజనుల్లో వ్యక్తమవుతోంది. అయినా కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి.