బాక్సాఫీస్ వద్ద `సికందర్` దారుణ వైఫల్యాన్ని చవి చూడటంతో సల్మాన్ ఖాన్ షాక్ లో ఉన్నాడు. ఈ సమయంలో అతడు తాజా ఫ్యాన్స్ మీట్ లో మనసు విప్పి చాలా విషయాలు మాట్లాడారు. ఈ సమావేశంలో తన అభిమానుల ప్రేమ, శ్రద్ధ చూసి సల్మాన్ చలించిపోయాడు. షూటింగ్ సమయంలో తొలి నుంచీ `సికందర్`లో ఏదో తేడా ఉందని, పెద్ద సినిమా తీయాల్సిన విధానం అది కాదని ఆయన ఒప్పుకున్నాడు. అయితే ఇకపై తన అభిమానులను సంతోషపెట్టే సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు.
సికందర్ గురించి అభిమానులు సల్మాన్ కి ఫిర్యాదు చేసారు. కంటెంట్ మాత్రమే కాదు.. మార్కెటింగ్ కూడా అంతగా బాలేదని ఫిర్యాదు చేశారు. విడుదల రోజున సినిమా లీక్ అయిందని సాజిద్ నదియాద్వాలా బృందానికి ఫిర్యాదు చేసినప్పుడు, నిర్మాత బృందం దానిని పెద్దగా పట్టించుకోలేదని సల్మాన్ దృష్టికి తీసుకు వచ్చారు. నిర్మాత సాజిద్ భార్య వార్దా నదియాద్వాలా అభిమానులను అవమానించే ట్వీట్‌ల గురించి సల్మాన్ కి చెప్పుకున్నారు. ట్వీట్‌ల స్క్రీన్‌షాట్‌లను సల్మాన్‌కు చూపించారు.
ఇదే సమయంలో సల్మాన్‌కు గతంలో బ్లాక్‌బస్టర్‌లను అందించిన, అతడితో చాలా మంచి అనుబంధం ఉన్న కబీర్ ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్ వంటి దర్శకులతో సినిమాలు చేయమని అభిమానులు సల్మాన్ ఖాన్‌ను కోరారు. పూజా దద్లానీ షారుఖ్ ఖాన్ -అతడి అభిమానుల మధ్య వారధిగా వ్యవహరించినట్లే, సల్మాన్ ఖాన్ కూడా తన అభిమానుల సందేశాలు, అభిప్రాయాల గురించి నేరుగా తెలుసుకునేలా చురుకైన వ్యక్తి వారధిగా ఉండాలని ఫ్యాన్స్ అభ్యర్థించారు. సల్మాన్ ఖాన్ ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఫ్యాన్స్ తో సమావేశం గంటసేపు కొనసాగింది. ఈ స్థాయి స్టార్ ఈ విధంగా అభిమానులను కలుసుకుని వారి బాధలను వినడం చాలా అరుదు. మరోసారి సల్మాన్ ఖాన్ తాను ఒక ప్రత్యేకమైన స్టార్ అని నిరూపించుకున్నాడు. తప్పులను సరిదిద్దుకుని బయటపడే ప్రయత్నం ఇకపై ప్రారంభించాడు. సల్మాన్ తదుపరి బజరంగి భాయిజాన్ సీక్వెల్ లో నటించే ఛాన్సుంది. యష్ రాజ్ ఫిలింస్ లోను వరుసగా ఫ్రాంఛైజీ చిత్రాల్లో నటించాల్సి ఉంది.