సమకాలీన ప్రపంచంలో సృష్టికి ప్రతి సృష్ఠి చేయగల దర్శకులలో క్రిస్టోఫర్ నోలాన్ ఒకరు. హద్దులే లేని క్రియేటివిటీతో అతడు కొత్త ప్రపంచాలను ఆవిష్కరిస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాడు. నోలాన్ ఏదైనా సినిమాని ప్రారంభిస్తే దాని గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ప్రతి సినిమాతో ఆస్కార్ లు కొల్లగొట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. నోలాన్ స్క్రిప్ట్ సెలెక్షన్, ఆర్టిస్టుల నుంచి ప్రదర్శన రాబట్టుకునే తీరు, స్క్రీన్ ప్లే మాయాజాలం ఇవన్నీ ప్రపంచానికి సరికొత్త వినోదాన్ని పరిచయం చేస్తాయి.
మెమెంటో, ది డార్క్ నైట్ ట్రయాలజీ, ఇంటర్‌స్టెల్లార్, ఇన్సెప్షన్, డన్ కిర్క్ ఇవన్నీ నోలాన్ దర్శకత్వంలో వచ్చినవి. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. నోలాన్ తెరకెక్కించిన చివరి చిత్రం `ఓపెన్ హీమర్` అణుబాంబ్ తయారీ, విస్పోటనం నేపథ్యంలో బయోపిక్ కథాంశంతో తెరకెక్కి సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కూడా పలు విభాగాల్లో ఆస్కార్ లు కొల్లగొట్టింది.
అయితే అలాంటి సుప్రసిద్ధ దర్శకుడితో అవకాశం వస్తే ఎవరైనా నటుడు వదులుకుంటారా? తాజాగా నోలాన్ దర్శకత్వంలో నటించాలనే తన కోరికను బయటపెట్టాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ తో కలిసి వార్ 2లో నటిస్తున్న హృతిక్ ఏమాత్రం అవకాశం కల్పించినా నోలాన్ తో పని చేస్తానని అన్నాడు. నోలాన్ కి తాను వీరాభిమానిని అని తెలిపాడు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న హృతిక్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాలీవుడ్ స్టార్లలో అద్భుతమైన లుక్, ఛరిష్మా, ఫిజికల్ అప్పియరెన్స్ ఉన్న హృతిక్ .. నోలాన్ లాంటి దర్శకుడితో పని చేస్తే అది నిజంగా ఒక వండర్ అవుతుందనడంలో సందేహం లేదు. అయితే యాభై వయసులో అతడు హాలీవుడ్ సినిమా కోసం చాలా డెడికేషన్ తో శ్రమించాల్సి ఉంటుంది. బాలీవుడ్ లో తదుపరి క్రిష్ 4 కి దర్శకత్వం వహించేందుకు హృతిక్ రోషన్ సిద్ధమవుతున్నాడు. అయితే తాజా ప్రకటన విన్న తర్వాత నోలాన్ నేరుగా కాల్ చేసి తన సినిమాలో వెంటనే అవకాశం కల్పిస్తే 1000 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న `క్రిష్ 4` అవకాశాన్ని హృతిక్ వదులుకుంటాడా?