80ల నాటి వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఓషో సహాయకురాలు మా ఆనంద్ షీలా బయోపిక్ తెరకెక్కనుందా? అంటే అవుననే సమాచారం. తాజా ఇంటర్వ్యూలో 75 ఏళ్ల షీలా తన జీవితకథలో ఆలియా భట్ నటిస్తే బావుంటుందని సూచించారు. ముఖ్యంగా ఆలియా భట్ రూపం తన రూపానికి దగ్గరగా ఉంటుందని అన్నారు. అలాగే తన పాత్రలో ప్రియాంక చోప్రా నటించి మెప్పించగలదని, కానీ ఆలియా భట్ ఆ పాత్రకు సూటవుతుందని వివరించారు.
ఈ బయోపిక్ కి కపూర్ & సన్స్, గెహ్రైయాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తారని కూడా షీలా స్వయంగా వెల్లడించారు. అయితే ఆర్థిక పరమైన సమస్యల కారణంగా ఇది పట్టాలెక్కలేదని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకనిర్మాతలు నిధులు సేకరించలేకపోయారని వెల్లడించారు. మీ పాత్రలో ఎవరు నటించాలని భావిస్తున్నారు? అని ప్రశ్నించగా, ప్రియాంక చోప్రా కంటే ఆలియా భట్ అయితే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
తాను బాలీవుడ్ సినిమాలు చూడలేదని కానీ ఆలియా నటించిన కొన్ని సీన్లు చూసానని షీలా అన్నారు. అప్పుడే ఆమె తన సోదరికి జాతీయ అవార్డు విజేత అయిన ఆలియా తన పాత్రను పోషించడానికి సరిగ్గా సరిపోతుందని చెప్పిందట. షీలా తన తొలినాళ్లలో ఆలియాలా ఎలా ఉండేదో కూడా వెల్లడించింది. షీలా ఈ విషయాన్ని షకున్ బాత్రాకు కూడా తెలిపారు. శకున్ బాత్రా 2021లో `సెర్చిండింగ్ ఫర్ షీలా` అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో నెట్‌ఫ్లిక్స్ `మా ఆనంద్ షీలా` జీవితాన్ని డాక్యు సిరీస్ గా విడుదల చేసింది.