లెజెండరీ దర్శకుడు మణిరత్నంతో ఆర్.మాధవన్ అలియాస్ మ్యాడీ అనుబంధం గురించి తెలిసిందే. ఆ ఇద్దరిదీ గురు శిష్యుల బంధం. కానీ ఈ రిలేషన్‌లో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కొన్నేళ్ల క్రితం మణిరత్నం చెలి చిత్రంతో నటుడిగా ఆరంగేట్రం చేసిన మాధవన్ ఆ తర్వాత యువ, గురు లాంటి చిత్రాల కోసం మణి సర్‌తో కలిసి పని చేసారు. యువలో మ్యాడీ మాస్ పాత్రకు గొప్ప ప్రశంసలు కురిసాయి.
మణిరత్నం యువ నాలుగు ప్రధాన పాత్రలతో సాగే సినిమా. ఇందులో సూర్య, సిద్ధార్థ్, మాధవన్, త్రిష లీడ్ పాత్రల్లో నటించారు. సూర్య యువ నాయకుడి పాత్రలో ఎగ్జయిట్ చేసే నటనతో ఆకట్టుకోగా, సిద్ధార్థ్ లవర్ బోయ్ గా నటించాడు. అయితే మాధవన్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో మాస్ అవతారంలో కనిపించాడు. అయితే ఈ పాత్రను మొదట మణిరత్నం మ్యాడీకి ఆఫర్ చేయలేదు. సిద్ధార్థ్ ని ఎంపిక చేసుకున్నారు. కానీ మాధవన్ పట్టుబట్టి మరీ అతడి నుంచి లాక్కున్నానని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు.
నిజానికి మాధవన్ కి ఈ పాత్రను ఆఫర్ చేయడం మణి సర్‌కి ఇష్టం లేదు. దానికి కారణం అతడి లుక్ సూట్ కాదని భావించాడు. కానీ దానిని ఛాలెంజింగ్ గా తీసుకున్న మాధవన్ నెలరోజుల సమయం అడిగాడు. నెల తర్వాత అతడు మణిరత్నం ఆఫీస్ కి వచ్చాడు. కానీ గుర్తు పట్టలేనంతగా మారిపోయిన మాధవన్ ని సెక్యూరిటీ వాళ్లు గేట్ వద్ద ఆపేసారు. మాధవన్ గుండు గీయించుకున్నాడు. ఎండకు నల్లగా మాడిపోయాడు. దీంతో అతడిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తు పట్టడం కష్టమైంది. గేటు వద్దనే అతడిని ఆపేసి మీరు ఎవరు? అంటూ ప్రశ్నించారు. `తెలిసిన వాళ్లు వచ్చారని చెప్పండి` అంటూ కబురు పంపగా, ఆయన సీరియస్ అయ్యారు. చివరికి మణి సర్ వచ్చారు. తనను ఎగా దిగా చూసారు. చివరికి మాధవన్ తన సిగ్నేచర్ స్టైల్ లో స్మైల్ ఇవ్వగానే అప్పుడు అందరూ గుర్తు పట్టారు. ఈ మేకోవర్ చూసి మణిరత్నం చాలా ఆశ్చర్యపోయారు. మాధవన్ అంత సీరియస్ గా తీసుకుంటాడని ఆయన భావించలేదట. యువలో ఇన్బా అనే విలన్ పాత్రకు అతడు బాగా సూటయ్యాడు. మ్యాడీ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇటీవల మాధవన్ నటించిన టెస్ట్ ఓటీటీలో విడుదలైంది. తదుపరి కేసరి చాప్టర్ 2లోను కనిపించనున్నాడు.