ప్రముఖ బాలీవుడ్ నటుడు-దర్శకుడు మనోజ్ కుమార్ ఇక లేరు. ఆయన వయసు 87. ముంబైలోని ధీరుభాయి అంబానీ కోకిలా బెన్ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. 87 ఏళ్ళ వయసులో ఆయన మరణించారని బాలీవుడ్ మీడియా ధృవీకరించింది. ఎన్నో దేశభక్తి చిత్రాలకు దర్శకత్వం వహించి వాటిలో ప్రధాన పాత్రల్లో నటించిన మనోజ్ కుమార్ తన నటనాభినయంతో భారీగా అభిమానులను సంపాదించారు. దేశభక్తి చిత్రాలతో పాపులరైన ఆయనను భారత్ కుమార్ అని కూడా పిలుస్తారు.
గత కొన్నేళ్లుగా భారత సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే వంటి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఆయన నిష్క్రమణతో అభిమానులు కలతకు గురవుతున్నారు. ప్రముఖులు తమ సంతాప సందేశాలను సోషల్ మీడియా వేదికలపై షేర్ చేస్తున్నారు. ఈ శనివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుమారుడు కునాల్ జాతీయ మీడియాకు వెల్లడించారు.
24 జూలై 1937న జన్మించిన హరికృష్ణ గిరి గోస్వామి మనోజ్ కుమార్ తనవైన విలక్షణ పాత్రలతో అందరి దృష్టినీ ఆకర్షించారు. హిందీ సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా దేశభక్తిని ప్రతిబింబించే సినిమాలతో అతడు సింహం అనే పిలుపును అందుకున్నారు. దేశం గర్వించదగిన ఎన్నో చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
1965లో షాహీద్ అనే చిత్రంలో ఆయన భగత్ సింగ్ పాత్ర పోషించారు. 1967లో ఉపకార్ లో ఇండో-పాక్ యుద్ధంలో అంకితభావం ఉన్న రైతు పాత్రలో నటించారు. ఈ పాత్రలో నటనకు గాను భారత్ కుమార్ అనే మారుపేరును అభిమానులు ఇచ్చారు. 1992లో ఆయన పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేసారు. దేశభక్తి చిత్రాలలో పురబ్ ఔర్ పశ్చిమ్ (1970), రోటీ కప్దా ఔర్ మకాన్ (1974) వంటి చిత్రాలలో నటనకు విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన పాత్రల చిత్రణ, సామాజిక అంశాలను ప్రతిబింబిస్తాయి. భారతీయ సినిమాకి మనోజ్ కుమార్ చేసిన కృషి అపూర్వమైనది. ఆయన రచనలు సినిమా నిర్మాతలకు, నటులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. లెజెండరీ నటుడి కుటుంబానికి సినీజోష్ ప్రగాఢ సానుభూతి.