విశాఖపట్నం రామానాయుడు స్టూడియోస్ కి షోకాజ్ జారీ చేయాల్సిందిగా కలెక్టర్ కి ఆదేశాలు అందడం చర్చనీయాంశంగా మారింది. స్టూడియోస్ కి చెందిన 35 ఎకరాల భూమిలో సురేష్ ప్రొడక్షన్స్ 15.17 ఎకరాల భూమిని లేఅవుట్లు వేసి విక్రయించేందుకు సిద్ధమవ్వడమే దీనికి కారణమని ఆరోపణలు ఉన్నాయి. స్టూడియో కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని ఇతర కార్యకలాపాలకు వినియోగించకూడదని వ్యతిరేకిస్తూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పిల్ వేయగా, దానికి అనుగుణంగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. దీని ప్రకారం.. సురేష్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియాకు కలెక్టర్ ను ఆదేశించారు. ఆ మేరకు విశాఖ మున్సిపల్ కమీషనర్, వీఎంఆర్‌డిఏ కమీషనర్ లకు ఇప్పటికే కలెక్టర్ నుంచి కొన్ని ఆదేశాలు అందాయని తెలిసింది.
నిజానికి ఇదే తరహాలో ఇంతకుముందు హైదరాబాద్ లోని పలు సినీస్టూడియోలకు నోటీసులు అందాయి. సూపర్ స్టార్ కృష్ణ కు చెందిన పద్మాలయా స్టూడియోస్, ఎం.ఎస్.రెడ్డి- శ్యాంప్రసాద్ కి చెందిన శబ్ధాలయా స్టూడియోస్, కే.రాఘవేంద్రరావు సినీమ్యాక్స్, రామకృష్ణ స్టూడియోస్ వంటి వాటికి గతంలో తెరాస ప్రభుత్వ హయాంలో నోటీసులు పంపారు. ఆ తర్వాత ఆ వివాదం నెమ్మదిగా సద్ధుమణిగింది.
గత వైకాపా హయాంలో సురేష్ ప్రొడక్షన్స్ లేఅవుట్లు ప్లాన్ చేయడంతో దానిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉందని కూడా ప్రముఖ మీడియాలో కథనాలొచ్చాయి. విశాఖ రామానాయుడు స్టూడియోస్ మ్యాటర్ కోర్టుల ఇన్వాల్వ్ మెంట్ తో జటిలంగా మారిందని తాజా పరిణామం చెబుతోంది. ఆ పదిహేను ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని మీడియాలో కథనాలొస్తున్నాయి.
ప్రముఖులకు సినీపరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించే ఏ భూములను ఇతర వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించకూడదనేది చట్టం. కానీ ఆదమరిచాక ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను వ్యాపారాలకు ఉపయోగిస్తే చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.