బాలీవుడ్ లో కాపీ క్యాట్ కథల గురించి చాలా కామెంట్లు ఉన్నాయి. రోహిత్ శెట్టి, సుభాష్ ఘాయ్ లాంటి చాలా పెద్ద దర్శకులే కాపీ కథల్ని వెండితెరపైకి తెచ్చారని విమర్శలున్నాయి. సినిమాని రన్ చేసే ప్రధాన థీమ్ లైన్ ని ఎత్తేయడం లేదా కొన్ని సీన్లు సీక్వెన్సులు కాపీ చేయడం వాళ్లకు కొత్తేమీ కాదు. టాలీవుడ్ లో అగ్ర దర్శకుల పైనా ఈ తరహా విమర్శలున్నాయి. కానీ బాలీవుడ్ దర్శకుల తరహాలో టూమచ్ కాపీ క్యాట్ లు మనకు లేరు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు లాపాటా లేడీస్ కథను 2019లో విడుదలైన అరబిక్ లఘు చిత్రం బుర్కా సిటీ నుంచి యథాతథంగా కాపీ కొట్టేశారని విమర్శలొస్తున్నాయి. కొద్దిరోజులుగా బుర్కా సిటీ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూడగానే అందరూ షాక్ కి గురవుతున్నారు. చూస్తుంటే ఇది లాపాటా లేడీస్ కథలాగే ఉంది. దారి ప్రయాణంలో వధువులు మారిపోయాక పెళ్లి కొడుకులు ఎలాంటి పాట్లు పడ్డారు? అనే కథతో కిరణ్ రావు లాపాటా లేడీస్ సినిమాని తెరకెక్కించారు. కామెడీ వ్యంగ్యం వంటి ఎలిమెంట్స్ హృదయాలను తాకుతాయి. బుర్కా సిటీ కథ కూడా ఇదే థీమ్ లైన్ తో సాగుతోంది. లాపాటా లేడీస్ థీమ్ లైన్ ని దీని నుంచి కిరణ్ రావు కాపీ కొట్టారని సులువుగా అర్థమైపోతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ దర్శకురాలు కిరణ్ రావు దీనిపై స్పందించలేదు. మునుముందు దీనిపై ఆమె వివరణ ఇస్తారేమో చూడాలి. లాపాటా లేడీస్ (2024) గత ఏడాది ఆస్కార్ లకు భారత్ తరపున విదేశీ కేటగిరీలో నామినేషన్ పొందిన సినిమా. అంత పెద్ద దర్శకురాలు ఇప్పుడిలా కాపీ క్యాట్ వివాదంలో చిక్కుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. లాపాటా లేడీస్ ని నిర్మించిన అమీర్ ఖాన్ లాంటి జెంటిల్మన్ ఈ కాపీ క్యాట్ సినిమాని ఆస్కార్స్ కి ఎలా పంపించగలిగారు? మనస్సాక్షి లేదా? అని నెటిజనులు విమర్శిస్తున్నారు.