ఇంటి నుంచి పారిపోయిన చాలా మందికి సులువుగా పని దొరికే చోటు వినోదరంగమేనా? సినిమాల్లో ఈజీగా అవకాశం వచ్చేస్తుందా? అంటే.. అది అస్సలు నిజం కాదు.. అంతకుముందు గొడ్డు చాకిరీ చాలా చేయాలి. హోటల్ లో అంట్లు తోమాలి. వెయిటర్ గా టేబుల్ ముందు నిలబడాలి. తినేసిన ప్లేట్లు తీసి కడగాలి. లేదా బార్ అండ్ రెస్టారెంట్లలో.. పబ్బుల్లో క్లీనింగ్ జాబ్స్ చేయాలి. ఇవన్నీ తల్లిదండ్రులను వదిలి పారిపోయిన వాళ్లను తక్షణం ఆదుకునేవి.
వినోదరంగంలో ఏ ఉద్యోగం అయినా వృత్తి నైపుణ్యానికి సంబంధించినది. అది అంత సులువు కాదు. సృజనాత్మకత, గట్స్ ఉండాలి. అప్పుడే ఇక్కడ అనుకున్నది సాధించగలరు. అయితే ఆరంభంలో రూ.200 తో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన హర్షవర్ధన్ రాణే.. తాను హీరో అవ్వక ముందు ఎలాంటి కష్టాలు అనుభవించాడు? ఎలాంటి గొడ్డు చాకిరీ చేసాడు అనేది జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఓపెనయ్యాడు.
ఇంటి నుంచి పారిపోయాక తిండి లేదు. బతకడానికి ఏదో ఒక పని కావాలి. అదే క్రమంలో అతడు చాలా ఉద్యోగాలు చేసాడు. హోటల్ లో క్లీనర్, డెలివరీ బాయ్ , డీజే అసిస్టెంట్, వడ్రంగి పని.. ఇలా చాలా చేసాడు. కానీ అతడు ఏం చేస్తున్నా సంతృప్తి ఉండేది కాదు. అతడి అసలు ఆసక్తి నటుడు అవ్వాలని. కానీ అది అంత సులువుగా వచ్చే అవకాశం కాదు. చివరికి హైదరాబాద్ లో వడ్రంగి పని చాలాకాలం పాటు చేసాడు. స్టేషన్ ముందు పాత ఫర్నిచర్ కొనుక్కుని దానికి రిపెయిర్లు చేసి తిరిగి అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో కొంతకాలం బతికాడు.
చివరికి నటుడవ్వాలన్న పంతంతో అతడు హీరో అవ్వగలిగాడు. అందాల కథానాయిక భూమిక నిర్మాతగా మారి రూపొందించిన తకిట తకిట సినిమాతో హీరో అయ్యాడు హర్షవర్ధన్ రాణే. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ తర్వాత అవకాశాల్లేవ్. దాంతో వడ్రంగి పనిని కొనసాగించాడు. అటుపై బాలీవుడ్ లో ఆడిషన్స్ ఇచ్చి కొన్ని సినిమాల్లో నటించాడు కానీ బ్రేక్ లేదు. అతడు నటించిన సనమ్ తేరి కసమ్ చిత్రం కరోనా సమయంలో విడుదలై ఫ్లాపైంది. కానీ అదే సినిమాని ఇటీవల రిరీలీజ్ చేయగా బంపర్ హిట్ కొట్టింది. సక్సెస్ ఇచ్చిన కిక్కులో ఇప్పుడు హర్ష్ కి అవకాశాలొస్తున్నాయి. హీరోగా డిమాండ్ పెరిగింది. ఇదే ఉత్సాహంలో అతడు తాజా ఇంటర్వ్యూలో ఉపాధి కోసం, ఒక పూట కనీస తిండి కోసం ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో ఓపెనయ్యాడు. తల్లిదండ్రులను ఇంటిని వదిలి హైదరాబాద్ కి వచ్చాక ఎలాంటి కష్టాలు పడ్డాడో ఎలాంటి భేషజం లేకుండా చెప్పాడు. ఒకసారి డబ్బు, స్వాతంత్య్రం వచ్చాక దేవుడి అండతో మనుగడ సమస్య ఉండదని తన అనుభవాన్ని వివరించాడు. అతడు తదుపరి మిలాప్ జవేది దర్శకత్వంలో దీవానియత్ అనే ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు.