బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్నేహితుడు, బాంద్రా(ముంబై) ఎమ్మెల్యే బాబా సిద్ధిఖిని దారుణంగా హత్య చేసిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు ఇప్పుడు మరో ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. నెక్ట్స్ టార్గెట్ నువ్వే.. చావుకు రెడీగా ఉండు! అంటూ బిష్ణోయ్ ముఠా నేరుగా సమాజ్‌వాదీ పార్టీ నాయకుడిని ఫోన్‌లో బెదిరించారు.
సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రతినిధి తారిఖ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందని చెబుతున్న ఓ వ్యక్తి నుండి బెదిరింపు కాల్ వచ్చినట్టు కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం వచ్చిన గ్యాంగ్ స్టర్ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో ఇంకా ఏదీ తేలలేదు.
ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తారిఖ్ ఖాన్ తనకు గ్యాంగ్ స్టర్ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆందోళన చెందారు. ఆయన మాట్లాడుతూ-`గత రెండు నెలలుగా నాపై దుర్భాషలాడుతూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వాటిని నేను పట్టించుకోలేదు. అయితే శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి కాల్ చేసి దుర్భాషలాడడమే కాకుండా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరపున మాట్లాడుతున్నట్లు కూడా చెప్పాడు. బెదిరింపు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని నేను వెంటనే పోలీసు సూపరింటెండెంట్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సమాచారం అందించాను` అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
ఇది నకిలీ బెదిరింపా? లేక నిజంగా గ్యాంగ్ స్టర్ నుంచి వచ్చిన బెదిరింపులా? అన్నది పోలీసులే నిగ్గు తేల్చాల్సి ఉందని అతడు అన్నారు. అసలింతకీ బిష్ణోయ్ అనుచరుడు కాల్ చేసి ఏమని బెదిరించాడు? అంటే...`జాగ్రత్తగా ఉండండి లేదా మీ నంబర్ నెక్ట్స్ వస్తుంది!` అని అతడు నేరుగా హెచ్చరించాడు. మీకు త్వరలోనే తెలుస్తుంది.. రెండు మూడు రోజులు ఆగండి.. నేనేంటో నీకు చూపిస్తాను! అని అతడితో పాటు ఉన్న మరో వ్యక్తి తనను బెదిరించాడని ఎమ్మెల్యే తారిఖ్ ఖాన్ తెలిపారు. గుర్తు తెలియని కాలర్ నుండి అసభ్యకరమైన మాటలతో కాల్ అకస్మాత్తుగా ముగుస్తుందని కూడా వెల్లడించాడు.
గత సంవత్సరం అక్టోబర్‌లో ముంబై పోలీసులు బహ్రైచ్ జిల్లాలోని ఒక గ్రామాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబా సిద్ధిక్ హత్యతో ముడిపెట్టారని ఏఎస్పీ ఒకరు చెప్పారు. అక్టోబర్ 12న ముంబైలో దసరా వేడుకల సందర్భంగా లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు ఎమ్యెల్యే బాబా సిద్ధిఖ్‌ను కాల్చి చంపారు. బహ్రైచ్‌లోని బాడి హాట్‌లోని మొహల్లా చోటి బజార్ నివాసి తారిఖ్ ఖాన్, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు తేజే ఖాన్ కుమారుడు. బహ్రైచ్ మున్సిపల్ బోర్డు ఛైర్మన్‌గా తేజే ఖాన్ రెండుసార్లు పనిచేశారు. ప్రస్తుత బెదిరింపులు రాజకీయంగా పెద్ద చర్చకు తెరతీస్తున్నాయి.