బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికందర్ చిత్రం రంజాన్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలైన వెంటనే ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిపడింది. తొలి షో నుంచే స్క్రీన్‌ప్లే బోరింగ్ గా ఉందని సినిమా ఎక్కడా ఆకట్టుకోలేకపోయిందని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సల్మాన్ అభిమానులే సోషల్ మీడియాలో ఫ్లాప్ టాక్‌ను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇది సల్మాన్ కెరీర్‌లో మరో సంతృప్తిని ఇవ్వని చిత్రంగా మారే అవకాశాలున్నాయి.
అయితే ఇక్కడ అసలు చర్చ సల్మాన్ గురించి కాదు రష్మిక మందన్నా గురించి. బాలీవుడ్‌లో దూసుకుపోతున్న రష్మిక కు ఈ సినిమా సడన్ షాక్ ఇచ్చినట్లు అయింది. రష్మిక పాత్ర సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యేలా ఏమీలేకపోవడంతో ఆమె అభిమానులకు నిరాశ కలిగింది.
ఇటీవల కాలంలో రష్మిక కెరీర్‌లో వరుసగా సూపర్ హిట్స్ వచ్చాయి. పుష్ప-2 అఖిల భారత స్థాయిలో సంచలన విజయాన్ని అందుకుంది. యానిమల్ సినిమా బాలీవుడ్‌లో ఓ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే ఛావా సినిమా కూడా ఆమెకు మరొక ఘన విజయాన్ని అందించింది. ఈ జోరు కొనసాగుతుండగా.. సికందర్ సినిమా మాత్రం రష్మికకు చిన్న బ్రేక్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.
ఈ సినిమా విడుదలకు ముందే లీక్ అయ్యిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే తక్కువ అంచనాలున్న ఈ చిత్రంపై మరింత ప్రతికూల ప్రభావం పడింది. ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేకపోవడం వల్ల సల్మాన్ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా సినిమా విడుదలైన మొదటి రోజే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.