విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత భారీ విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి తన సత్తా చాటారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం తెలుగు మార్కెట్‌లోనే విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. థియేటర్లకు దూరంగా ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్‌ను తిరిగి తీసుకురావడంలో ఈ చిత్రం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా వెంకటేష్ వినోదాత్మక నటన, మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పించాయి.
ఈ విజయంతో వెంకటేష్ వెంటనే కొత్త సినిమా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఆయన ఓపికగా కథల ఎంపికలో శ్రద్ధ చూపుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం విడుదలై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ మధ్య దర్శకుడు నందు వెంకటేష్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అది ఇంకా చర్చల దశలోనే ఉందని వెంకటేష్ మాస్ ఇమేజ్‌కు తగ్గ కథను సిద్ధం చేసేందుకు దర్శకుడు మరింత కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ వేసవి మొత్తం వెంకటేష్ విరామం తీసుకుని కొత్త ప్రాజెక్ట్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. నందుతో సినిమా ఓకే అయితే ముందుగా అదే పూర్తి చేయాలని వెంకటేష్ భావిస్తున్నారు. ఇక తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ తెరకెక్కనుందని సమాచారం. 2027 సంక్రాంతికి ఈ సీక్వెల్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
విజయం వచ్చిందని వెంటనే కొత్త సినిమాపై త్వరపడకుండా వెంకటేష్ కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే వినోదాత్మక కథలే తనకు సరిపోతాయని భావిస్తున్న వెంకటేష్ ప్రయోగాత్మక యాక్షన్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే విన్న కొన్ని కథలను పక్కన పెట్టిన వెంకటేష్ తన తదుపరి సినిమాపై స్పష్టత వచ్చే వరకు ఓపికగా ఎదురు చూస్తున్నారు. అభిమానులు మాత్రం వెంకటేష్ తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.