మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే కొత్త సినిమా ఉగాది రోజున గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు పూర్తి చేసిందని సమాచారం. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల స్క్రిప్ట్ లాక్ కావడంతో అనిల్ రావిపూడి షూటింగ్‌లో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసేలా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో కథానాయిక ఎవరనే దానిపై భారీ చర్చ జరుగుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి బాలీవుడ్ నుండి ఓ ప్రముఖ హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పరిణితి చోప్రా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ నటి, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ నటనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆమె ఇంకా ఒప్పందం కుదుర్చుకుందా లేదా అనేది క్లారిటీ రావాల్సిన విషయం.
ఇక పరిణితి కాకుండా మరో ప్రముఖ నటి అదితి రావు హైదరి పేరు కూడా పరిశీలనలో ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు కథ వినిపించినా.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుందనే దానిపై స్పష్టత రాలేదు. ఉగాది రోజున ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ప్రకటించబోతున్నారా..? లేక హీరోయిన్ ఎంపిక పూర్తయిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదే సమయంలో సీనియర్ హీరోలకు జోడీగా కొత్త హీరోయిన్లను ఎంపిక చేయడం దర్శకులకు కాస్త పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే అంజలి, తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ కథకు తగ్గ హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు చిత్రబృందం ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. చివరికి చిరంజీవి సరసన ఎవరు నటిస్తారనేది సినీ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.