టాలీవుడ్ స్టార్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మధ్య ప్రేమ సంబంధం ఉందనే వార్తలు గత కొంతకాలంగా వైరల్ అవుతున్నాయి. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సమయంలో వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ఇటీవల బ్రేకప్ చెప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ వర్మ తన రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతూ.. ప్రేమ అనేది ఓ ప్రయాణమని దాని ప్రతి అనుభూతిని ఆస్వాదించాలన్నారు. ఏ బంధంలో అయినా సంతోషం, బాధ, విరహం సహజమేనని వాటిని స్వీకరించి ముందుకు సాగాలని తెలిపారు.
తమన్నా కూడా ఇటీవల ప్రేమపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిజమైన ప్రేమ నిస్వార్థంగా ఉండాలని, దాన్ని లావాదేవీలా చూడకూడదని అన్నారు. సంబంధంలో ఉన్నప్పుడు పరస్పర అవగాహన చాలా ముఖ్యం అని జీవిత భాగస్వామి ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో తమన్నా, విజయ్ వర్మ గత కొంతకాలంగా కలిసి ఎక్కడా కనిపించకపోవడం, పబ్లిక్ ఈవెంట్స్‌లో కూడా వేర్వేరుగా హాజరవడం ఈ బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
హోలీ వేడుకల్లో ఇద్దరూ వేర్వేరుగా హాజరయ్యారు. అంతేకాకుండా తమ సోషల్ మీడియా ఫోటోలలో ఒకరి జాడ మరొకరిలో లేకపోవడంతో వీరి మధ్య విబేధాలు వచ్చినట్లు అనుమానాలు మరింత పెరిగాయి. అయితే ఇప్పటివరకు వీరి బ్రేకప్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. నిజంగా వీరి ప్రేమకు తెరపడిందా..? లేక ఇది కేవలం గాసిప్పా..? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.