ప్రముఖ నటి సమంత గత కొన్ని రోజులుగా సిడ్నీలో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఇండియన్ పింక్ ఫెస్టివల్ ఈవెంట్‌లో ఆమె పాల్గొన్నారు. కెరీర్‌లో అనేక ఒడిదుడుకులు ఎదురైనా తామేంటో నిరూపించుకోవాలని సమంత అన్నారు. విజయాన్ని కేవలం ప్రఖ్యాతి పొందడంగా చూడకూడదని, సామాజిక బాధ్యతలు నిర్వర్తించడం, మనసుకు నచ్చిన జీవితం గడపడం కూడా విజయానికి గుర్తే అని ఆమె తెలిపారు. అంతేకాదు స్వచ్ఛమైన ఆలోచనలతో మానసిక ఒత్తిడిని అధిగమించడంపై ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జీవితాన్ని శాంతిగా, సంతోషంగా కొనసాగించాలని సూచించారు.
నా దృష్టిలో సక్సెస్ అంటే స్వేచ్ఛ. విజయవంతమయ్యానని ఇతరులు చెప్పేంత వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. విజయం అంటే మనకు నచ్చిన విధంగా జీవించడం, మన ఎదుగుదలకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవడం. మహిళలకు కొన్ని నియమాలతో ఆంక్షలు పెట్టడం కాదు, వారు అనేక భిన్న పాత్రలను సమర్థంగా నిర్వహించగలరు అని సమంత వివరించారు. కెరీర్‌లో తాను నిర్మాతగా మారడానికి గల కారణాలను వెల్లడిస్తూ, తాజా టాలెంట్‌ను ప్రోత్సహించడానికి.. కొత్త కథలను ప్రేక్షకులకు అందించడానికి తన నిర్మాణ ప్రయాణాన్ని మొదలు పెట్టినట్లు తెలిపారు.
సిడ్నీ పర్యటనలో భాగంగా సమంత అక్కడి యువతతో మాట్లాడారు. తన విద్యార్థి దశలో ఆస్ట్రేలియాలో చదవాలని, ప్రత్యేకంగా సిడ్నీ యూనివర్సిటీలో విద్యను అభ్యసించాలని అనుకున్నానని చెప్పారు. అయితే ఆ కల నెరవేరలేదు. కానీ అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టడం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపారు. ఇప్పుడు సినీ పరిశ్రమలో తనకున్న స్థానం, అభిమానుల ప్రేమ తనకు గొప్ప సంతోషాన్ని ఇస్తోందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తమ కలలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు.