ఎవరైనా జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఎన్నో కష్టాలను, అవమానాలను తట్టుకోవాలి. విజయం ఎప్పుడూ తేలికగా దక్కదు. టాలీవుడ్ నటి శోభిత ధూళిపాళ కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంది. తెలుగులో కన్నా బాలీవుడ్‌లోనే ఆమెకు ఎక్కువ గుర్తింపు లభించింది. అయితే అగ్రహీరోయిన్గా ఎదిగే ప్రయత్నంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
ఒకరోజు రాత్రి 11.30 గంటలకు ఓ ప్రముఖ బ్రాండ్ నిర్వాహకులు ఫోన్ చేసి తక్షణమే ఆడిషన్‌కు రావాలని కోరారు. ఆ సమయానికి ఆడిషన్ అంటే కొంత ఆశ్చర్యంగా అనిపించినా.. అవకాశాన్ని చేజార్చుకోవద్దనే ఉద్దేశంతో వెళ్లిందట. ఆడిషన్ పూర్తైన తర్వాత నిర్వాహకులు ఆమె సెలెక్ట్ అయ్యిందని.. త్వరలోనే గోవాలో యాడ్ షూట్ జరగబోతుందని తెలిపారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉండకపోయినా గోవా అనే పేరు వినగానే ఎంతో ఆనందించిందని చెప్పింది.
మొదటి రోజు షూటింగ్ సజావుగా సాగింది. అయితే రెండో రోజు కెమెరాలో టెక్నికల్ సమస్యలు వచ్చాయని చెప్పి మిగిలిన భాగాన్ని ఆపివేశారు. తర్వాతి రోజు సెట్ కు వెళ్లగానే ఈ అమ్మాయి మన బ్రాండ్‌కు సరిపోదు అని నిర్వాహకులు వెనక్కి తగ్గారని తెలిసింది. అసలు కారణం ఏమిటంటే.. తాను చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోందని వాళ్లు భావించలేకపోయారట. సాధారణంగా బ్రాండ్ ప్రమోషన్‌కి మరింత సాధారణమైన వ్యక్తిత్వం ఉండాలని భావించిన నిర్వాహకులు ఆమె స్థానంలో ఓ శునకాన్ని తీసుకున్నారని ఆశ్చర్యపోయింది. అయినా ఒక రోజు పని చేసినందుకు తనకు పారితోషికం అందిందని చెప్పింది. అయితే ఈ అనుభవం తనకు జీవితంలో ఓ పాఠంగా మారిందని తెలిపింది.
సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత శోభిత తన మొదటి అవకాశం రామన్ రాఘవన్ 2.0 అనే హిందీ చిత్రంలో పొందింది. తెలుగులో గూఢచారి సినిమాతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్ లో నటించి తన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించింది. అదే విధంగా కల్కి 2898 A.D చిత్రంలో దీపికా పదుకోణే పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పింది.
2024 డిసెంబర్ 4న శోభిత టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకునేందుకు కృషి చేస్తోంది. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా వాటిని దాటి విజయాన్ని సాధించిన ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.