పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. రాజమౌళి లాంటి బ్రాండ్ సహాయం లేకుండానే స్వయంగా తన మార్కెట్‌ను పెంచుకుని ఇండస్ట్రీలో ఓ బ్రాండ్‌గా నిలిచిపోయాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత ఆయన పలు ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. వాటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయనున్న సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది.
పుష్ప 2 పూర్తైన వెంటనే త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ స్థానాన్ని అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తాము ఇప్పటివరకు ఎవ్వరూ చేయని భారీ స్థాయి మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నామని నాగవంశీ తెలిపారు. ఇది ఒక ప్రామాణికమైన పురాణ కథా చిత్రం కానీ మహాభారతం లేదా రామాయణంతో సంబంధించిన కథ కాదని మన పురాణాల్లో ఇంతవరకు ఎవరూ అంతగా తెలుసుకోని ఓ ఆసక్తికరమైన పాత్ర ఆధారంగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమా మొదలైన తర్వాత ఇండియన్ సినిమా ప్రపంచం అంతా దీనిపైనే దృష్టి పెడుతుందని ఆయన ధీమాగా తెలిపారు. నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహానికి గురి చేశాయి. త్రివిక్రమ్ స్టైల్‌లో ఉండే ఈ మైథలాజికల్ సినిమా ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ఇప్పటికే మొదలైంది.