ఇటీవల కాలంలో సంజయ్ దత్ కు దక్షిణ భారత సినీ పరిశ్రమలో విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి. కేజీఎఫ్ 2, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల్లో ఆయన తనదైన శైలిలో మెరిశారు. తాజాగా సాయి ధర్మ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఎటిగట్టు చిత్రంలో విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ ను తీసుకున్నారనే వార్త గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు ఇప్పటికే రాజాసాబ్ లో కూడా ఆయన ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయనకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న స్పిరిట్ గురించి సినీప్రియులందరికీ తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ ఉగాదికి ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సంజయ్ దత్‌ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజాసాబ్ షూటింగ్ సమయంలో ప్రభాస్ – సంజయ్ దత్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని.. ప్రభాస్ సూచన మేరకే స్పిరిట్ చిత్రంలో ఆయనను తీసుకున్నారని టాక్.
సంజయ్ దత్ పారితోషికం భారీగా ఉండటమే కాకుండా.. ఆయన వ్యక్తిగత సిబ్బందిని కూడా నిర్మాతలు చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా చిత్రబృందానికి ఓ భారం అవుతుంది. కానీ బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే సంజయ్ దత్ వంటి స్టార్ నటుడు ఈ సినిమాలో భాగం కావడం పెద్ద ప్రయోజనమే. అంతేకాదు సినిమాలో విలన్ పాత్రకూ మాసివ్ హైప్ వస్తుంది.
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోకు ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. అందులో సంజయ్ దత్ చేరితే సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కథానాయికగా పలు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.