శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా ప్రధాన పాత్రలో వచ్చిన లీడర్ సినిమా అప్పట్లో రాజకీయ నేపథ్యంలో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా రానా, శేఖర్ కమ్ముల కెరీర్‌కు మైలురాయిగా మారింది. రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని ప్రామాణికంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేసింది. కానీ వాణిజ్యపరంగా ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయం సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు లీడర్ మళ్లీ తీస్తే..? పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తే..? అది భారతీయ సినిమాల్లో మరో గొప్ప ప్రయోగాత్మక చిత్రంగా నిలిచేది.
ఇటీవల శేఖర్ కమ్ముల ఇచ్చిన ఇంటర్వ్యూలో లీడర్ 2 గురించి ఆసక్తికరమైన సంకేతాలు కనిపించాయి. లీడర్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు లక్ష కోట్లు అనే మాట వినిపిస్తే ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు అదే చాలా చిన్న మొత్తంగా మారిపోయింది. ఈరోజు రాజకీయాలు మరింత పెద్ద ఆటగా మారిపోయాయి అని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థను, సామాజిక పరిస్థితులను సరికొత్త దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని.. తన చిత్రాల్లో ఆ అంశాలను మరింత గంభీరంగా చూపించాలని ఉందని చెప్పారు.
అయితే తాను అసలు దర్శకుడిగా మారాలనే ఉద్దేశం లేకుండానే సినిమా రంగంలోకి వచ్చానని శేఖర్ కమ్ముల తెలిపారు. కానీ ఇప్పుడు లీడర్ 2 తీస్తే అది పాన్ ఇండియా స్థాయిలో గొప్ప ప్రాధాన్యం పొందే చిత్రంగా మారుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి ప్రయోగాత్మక సినిమాలను కొంత మంది మాత్రమే తీస్తారు.. ఆ జాబితాలో శేఖర్ కమ్ముల ముందువరుసలో ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.