అల్లు అర్జున్, అట్లీ కలయికలో ఓ భారీ సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ దుబాయ్‌లో ఉన్నారు. అక్కడ చిత్రబృందంతో కథా చర్చలు జరుపుతున్నారని సమాచారం. భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇన్నాళ్లుగా ఈ సినిమాపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. అందులో ఒకటి పూర్తిగా నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రగా ఉండనుందట. విలన్ రేంజ్‌లో ఉండే ఈ క్యారెక్టర్ బన్నీ నటనకు కొత్త మైలురాయిగా నిలిచేలా ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పటికే పుష్పలో అల్లు అర్జున్ పాత్రకు కొంత నెగటివ్ షేడ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా పాత్ర కోసం ఆయనకు పెద్దగా కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ కూడా తన తదుపరి సినిమాపై కసరత్తులు కొనసాగిస్తున్నారు. దుబాయ్ నుంచి బన్నీ తిరిగి వచ్చిన తర్వాత త్రివిక్రమ్‌తో ఆయన ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత బన్నీ తన కొత్త ప్రాజెక్ట్‌పై స్పష్టమైన ప్రకటన ఇవ్వనున్నారు.
ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ అట్లీ-బన్నీ కాంబో ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.