బిగ్‌బాస్ షో వల్ల కంటెస్టెంట్లకు మంచి గుర్తింపు వస్తుంది అనేది సత్యమే. కానీ అందరికీ అది సానుకూలంగా మారుతుందా అంటే అలా ఉండదు. కొందరు మంచి పేరు తెచ్చుకుంటే.. మరికొందరు విమర్శలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా బిగ్‌బాస్ 8వ సీజన్‌లో పాల్గొన్న సోనియా ఆకుల పేరు నెగెటివ్ ప్రచారంతో ఎక్కువగా వినిపించింది. షోలో ఆమె ప్రవర్తన, మాటతీరు చూసిన ప్రేక్షకులు కొందరు ఆమెను ట్రోల్ చేయగా.. మరికొందరు వ్యతిరేకంగా స్పందించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెకు మరోసారి బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం వస్తే వెళ్లాలనుకుంటున్నారా..? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన ఆమె తాను ఆ షోలో మళ్లీ పాల్గొనాలని అనుకోవడం లేదని చెప్పింది. అయితే ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలిపింది. అది హోస్ట్ మారాలని.
తాను షోలో చెప్పిన కొన్ని విషయాలను తప్పుగా అర్థం చేసుకుని, బాడీ షేమింగ్ అని ముద్రవేశారని ఆమె అభిప్రాయపడింది. హోస్ట్‌గా ఉన్న వ్యక్తి అనుకూలంగా కాకుండా న్యాయంగా వ్యవహరించాలని సూచించింది. నాగార్జున స్థానంలో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడింది.
రానా హోస్ట్‌గా ఉంటే సరైన తీర్పులు ఇస్తారని.. అనవసరమైన ప్రేమ కోణాలు లేవనెత్తకుండా స్పష్టతతో వ్యవహరిస్తారని ఆమె అభిప్రాయపడింది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగినంత వరకు తాను బిగ్‌బాస్ హౌస్‌లోకి మళ్లీ వెళ్లే ఉద్దేశం లేదని తెలిపింది.
ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయని.. తాను తన కెరీర్‌ను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లుతున్నానని తెలిపింది. నెమ్మదిగా అయినే సరే.. మంచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నానని చెప్పింది. తాజాగా ఆమె నటించిన కిల్లర్ ఆర్టిస్ట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.