2024 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేసి గెలుపు సాధించిన చంద్రబాబు - పవన్ కళ్యాణ్ ల బంధం రోజు రోజు కి పెరుగుతుంది తప్ప వైసీపీ నేతలు అనుకుంటున్నట్లుగా ఎక్కడా బీటలు వారడం లేదు. చంద్రబాబు పై పవన్ అభిమానం చూపిస్తుంటే పవన్ పై చంద్రబాబు వీరాభిమానం చూపిస్తున్నారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ నడుమ ఫిట్టింగ్ పెట్టాలని వైసీపీ నేతలు మాత్రమే కాదు బ్లూ మీడియా కూడా ప్రయత్నాలు చేస్తుంది.
కానీ బాబు-పవన్ మధ్యన స్నేహం పెరుగుతుంది తప్ప తరగడం లేదు, తాజాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి విజయవాడలోని ఎ కన్వెన్షన్‌లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్కిట్స్ చూసి పడి పడి నవ్వారు.
ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మోడీ ఇండియాకి వరసగా మూడుసార్లు ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టారు. చంద్రబాబు అలాగే సీఎం కావాలని కోరుకుంటున్నాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నేతృత్వంలో పని చెయ్యడానికి తానెప్పుడూ సిద్దమే అన్నారు. చంద్రబాబు గారు ఈ ఈవెంట్ లో ఈ రోజు నవ్వినంతగా గతంలో నవ్వడం తాను చూడలేదన్నారు. రాష్ట్ర ప్రజల బాధ్యత మోస్తున్న చంద్రబాబు ఎప్పుడూ గంభీరంగా ఉంటారని, ఇలా నవ్వే పరిస్థితి ఉండదని.. సీఎం కుర్చీలో అంత ఒత్తిడి ఉంటుందన్నారు.
మరి పవన్ కళ్యాణ్ తన మనసులోని చంద్రబాబు పై ఉన్న నమ్మకాన్ని, ప్రేమను మరోసారి ఈ వేదికపై చూపించడంతో వీరి స్నేహం, విడగొట్టలేనిది అని అందరూ మాట్లాడుకుంటున్నారు.