ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల నిర్వహణ, వాటి ప్రచారం నేరంగా పరిగణిస్తున్నామని, అలాంటి వారిని వెంటనే శిక్షిస్తామని హెచ్చరించారు హైదరాబాద్ పోలీస్. ఈ తరహా స్కామ్ లలో ఉన్న వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని అధికారులు సీరియస్ గా హెచ్చరించారు. బెట్టింగ్ యాప్ ల దందాలో పలువురు సినీనటులు, యాంకర్లు ఉన్నారని తెలిసినట్టు కూడా పోలీసులు తెలిపారు. సినీతారలను కూడా విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పుడు ప్రకటించినట్టే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కొరడా ఝలిపించారు నగర పోలీస్. దీనిలో భాగంగా పంజాగుట్ట పోలీసులు సోమవారం ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణు ప్రియ, శ్యామల, రీతు చౌదరి, బండారు శేషాయని సుప్రిత, అజయ్, సన్నీ, సుధీర్ సహా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై కేసులు నమోదు చేశారు. 11 మంది నటులపైనా కేసులు పెట్టారని తెలిసింది. చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఉన్నారని నిగ్గు తేలింది.
మాతృశ్రీ నగర్‌కు చెందిన వినయ్ వంగల (40) అనే ప్రైవేట్ ఉద్యోగి జూదం కార్యకలాపాలను ప్రోత్సహించే మొబైల్ యాప్‌లు , వెబ్‌సైట్‌లు 1867 నాటి పబ్లిక్ జూదం చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. తన కెరీర్ వృద్ధి కోసం అమీర్‌పేటలో శిక్షణ తరగతులకు హాజరవుతున్నానని, ఈ శిక్షణ కోసం వచ్చే చాలా మంది విద్యార్థులు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌ల గురించి చర్చిస్తున్నారని తాను గమనించానని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన వినయ్, అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్ల వినియోగంపై పంజాగుట్ట పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేశాడు. తప్పుడు విధానంలో జూదం- బెట్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించే అనేక మొబైల్ అప్లికేషన్లు , వెబ్‌సైట్‌లు ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని వినయ్ చెప్పినట్టు తెలిసింది.
ఈ ప్లాట్‌ఫారమ్‌లు జూదం పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా 1867 నాటి పబ్లిక్ జూదం చట్టాన్ని యాప్ లు ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తున్నాయి. బెట్టింగ్ వ్యసనపరులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపదించాలని అనుకుంటారు. ఇది సమాజానికి ప్రమాదం. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది.
యాప్ ల దందాలో చాలా కోణాలు ఉన్నాయి. అంతేకాదు.. ఆన్ లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రమోట్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌ఫ్లుయెన్సర్ల వివరాలను వినయ్ పోలీసులకు అందించారు. వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ని కూడా పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రకటన పద్ధతుల గురించి తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవుతారని అతడు చెబుతున్నారు.