ఆదిపురుష్, దేవర చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించారు బాలీవుడ్ స్టార్‌హీరో సైఫ్ అలీఖాన్. అతడు దక్షిణాదికి ఇప్పుడు సుపరిచితుడు. ఇదే సమయంలో సైఫ్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్ ని కరణ్ జోహార్ వెండితెరకు పరిచయం చేసాడు. కానీ అతడి డెబ్యూ మూవీ నాదనియాన్ పై చాలా విమర్శలు వచ్చాయి. ఇబ్రహీం లుక్స్ బావున్నా సైఫ్ రేంజు ప్రదర్శనను ఇవ్వలేకపోయాడని విమర్శించారు. అంతేకాదు నాదనియాన్ గందరగోళ ప్రేమకథ, కథనం రక్తి కట్టించలేదు! అంటూ క్రిటిక్స్ తీవ్రంగా విమర్శించారు. ఇందులో నటీనటుల ప్రదర్శనపై కాస్త హద్దు మీరి కామెంట్లు చేసారు.
అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ ఈవెంట్లో చిత్రనిర్మాత కరణ్ జోహార్ స్పందించారు. విమర్శకు కూడా ఒక పద్ధతి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలపై చెడుగా కామెంట్లు చేయడం ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. నాదనియాన్ కథాంశం, నటీనటుల ప్రదర్శనపై ఆన్‌లైన్ లో విమర్శలు వచ్చిన విషయాన్ని కరణ్ అంగీకరించారు. కానీ విమర్శకులు, నటులకు కూడా కుటుంబాలు ఉంటాయనేది మర్చిపోకూడదని అన్నారు. నెగెటివ్ వ్యాఖ్యలు విమర్శకుడిపైనే కాకుండా, సినిమా ఫలితంపైనా చెడుగా ప్రతిబింబిస్తాయని అన్నారు. విమర్శించాలి కానీ... అసభ్య పదజలంతో కఠినంగా వ్యాఖ్యానించడం సరికాదని కరణ్ సూచించారు. విమర్శకులతో తన రిలేషన్ వారి సినిమా సమీక్షల వల్ల ప్రభావితం కాదని కూడా కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. సినిమాలపై గౌరవప్రదమైన విమర్శలు అవసరమని అభిప్రాయపడ్డారు.
అయితే డెబ్యూ హీరో ఇబ్రహీం అలీఖాన్ కి కొందరు ఇతర పరిశ్రమ ప్రముఖులు మద్ధతుగా నిలిచారు. ముఖ్యంగా సైఫ్ లాంటి అగ్ర హీరో నటవారసుడు తెరకు పరిచయమవుతున్నాడంటే, కచ్ఛితంగా తండ్రి పోలికలు చూస్తారని, అయితే మొదటి సినిమాతోనే యువనటుడిపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోకూడదని పలువురు బాలీవుడ్ ప్రముఖులు విశ్లేషించారు. ఇబ్రహీం లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు.. కానీ నటుడిగా చాలా పరిణతి చెందాల్సి ఉంటుందని కూడా సూచించారు.
ఈ చిత్రంలో శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ కథానాయికగా నటించింది. ది ఆర్చీస్ ఓటీటీ షో తర్వాత ఖుషీ కపూర్‌కి ఇది రెండో పెద్ద తెర అవకాశం. ఖుషీ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటించిన లవ్ యాపా చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.