సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కూలీ సినిమాకు భారీ డిజిటల్ డీల్ కుదిరింది. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులు ఏకంగా 120 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇది సినిమా మార్కెట్‌ను మరింత పెంచడమే కాకుండా సినిమాపై అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
కూలీ సినిమాకు తెలుగులోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం దాదాపు 45 కోట్ల రూపాయల వరకు పలుకుతుండటంతో ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆసియన్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. భారీ తారాగణం, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ముందే మంచి వాణిజ్య స్థాయిని సాధించిందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండటంతో మరింత ప్రొడక్షన్ విలువ పెరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
టాలీవుడ్‌లో విజయవంతమైన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న హిందీ సినిమా జాట్ ఓటీటీ హక్కులకు భారీ ధర పలికింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అయితే మొత్తం సినిమాకు దాదాపు 140 కోట్ల బడ్జెట్ ఉండటంతో ఈ డీల్ నిర్మాతలకు భారీగా ఉపయోకరపడుతుందని భావిస్తున్నారు.
ఇటీవల ఓటీటీ హక్కుల రేట్లు అంతగా ప్రభావం చూపకపోయినా.. పెద్ద ప్రాజెక్ట్‌లు, స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలకు మాత్రం మంచి ఆదరణ కనిపిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, విశ్వసనీయమైన కథ, ప్రముఖ నటుల కాంబినేషన్ ఉన్న చిత్రాలకు డిజిటల్ మార్కెట్‌లో స్థిరమైన డిమాండ్ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా కూలీ, జాట్ సినిమాలకు భారీ రేట్లు పలకడం ఇందుకు నిదర్శనం.
ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలిస్తే ఈవెంట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు మరింత ఆసక్తి చూపిస్తున్నాయి. భారీ విజువల్స్, అగ్రశ్రేణి నటుల పాత్రలు, ఆసక్తికరమైన కథలు ఉన్న ప్రాజెక్ట్‌లకు డిజిటల్ మార్కెట్‌లో మంచి స్థానం ఉంది. అందుకే రాబోయే రోజుల్లో కూడా స్టార్ హీరోలతో తెరకెక్కుతున్న భారీ సినిమాలకు డిజిటల్ డీల్స్ మరింత పెరిగే అవకాశముంది. కూలీ, జాట్ సినిమాల విజయంపై సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.