సినీ నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు. ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ 7 రన్నరప్ అమర్ దీప్ చౌదరితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే పీలింగ్స్ విత్ సుప్రీత అనే టాక్ షోను హోస్ట్ చేస్తోంది. హోలీ సందర్భంగా ఆమె అభిమానులకు శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాకుండా ఒక ముఖ్యమైన విషయంలో క్షమాపణలు కూడా కోరింది.
ఇటీవల బెట్టింగ్ యాప్‌లను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది. పోలీస్ శాఖ అనేక మందిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో సుప్రీత స్పందిస్తూ గతంలో తాను కూడా తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిందని అంగీకరించింది. ఇకపై అలాంటి ప్రమోషన్లలో పాల్గొనబోనని అందరూ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని సూచించింది.
తన తప్పును గుర్తించిన సుప్రీత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు అందరికీ క్షమాపణలు చెప్పింది. ఇక నుంచి అటువంటి యాప్‌లను పూర్తిగా విస్మరించాలని వాటిని డిలీట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా యువత అటువంటి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది.
ఈ సందర్భంగా ఎవ్వరూ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకూడదని స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియాలో కూడా అలాంటి యాప్‌లను ఫాలో కావద్దని సూచించింది. ప్రజలు బెట్టింగ్ అలవాటును పూర్తిగా మానుకోవాలని.. ఈ రకమైన ప్రయోగాలు ఆర్థికంగా, వ్యక్తిగతంగా తీవ్రమైన నష్టాలను కలిగించగలవని హెచ్చరించింది.