జనవరిలో విడుదలైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఘోరమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది. రామ్ చరణ్-శంకర్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప మిగతాదేది ప్రేక్షకులకు నచ్చలేదు. ఇప్పుడు పుండుమీద కారం చల్లినట్టుగా ఓ ప్రముఖ నటుడు గేమ్ చెంజర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తాను గేమ్ చేంజర్ ని బలగం కన్నా ముందే ఒప్పుకున్నాను, గేమ్ చేంజర్ కోసం 25 రోజులు కాల్షీట్లు ఇచ్చా, కానీ నా సీన్స్ అన్ని ఎడిటింగ్ లో పోయాయి. కేవలం ఒకటి రెండు సీన్స్ లో రెండు నిమిషాలు మాత్రమే కనిపించాను అంటూ నటుడు, కమెడియన్ ప్రియదర్శి కోర్ట్ మూవీ ప్రమోషన్స్ లో కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. శంకర్ గారితో వర్క్ చెయ్యడం నా కల అది నెరవేరింది అంటూ చెప్పాడు ప్రియదర్శి.
మరి చాలామంది నటులు ఇలాంటి కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వారు కొద్దో గొప్పో పేరున్న నటులు కావచ్చు, కానీ ఇక్కడ ప్రియదర్శి పేరున్న నటుడు, కమెడియన్. అలాంటి నటుల సీన్స్ నే ఎడిటింగ్ లో లేపెయ్యడం అనేది నిజంగా వారి బ్యాడ్ లక్ అనే చెప్పాలి.