టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్‌లతో కలిసి రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన తాజా ప్రాజెక్టుల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
హరి హర వీరమల్లు గురించి మాట్లాడిన నిధి అగర్వాల్ సినిమాల్లో నటించాలనే లక్ష్యంతోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించాను. కుటుంబంలో ఎవరూ సినీ పరిశ్రమకు చెందిన వారు కాకపోయినా నా కృషితో ఇండస్ట్రీలో చోటు సంపాదించుకున్నాను. హరి హర వీరమల్లు ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రెండు నెలల పాటు గుర్రపు స్వారీ, భరతనాట్యం, కథక్ నృత్య శిక్షణ తీసుకున్నాను. పవన్ కల్యాణ్ గారితో పని చేయడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. ఆయన ఎంతో తెలివైన వ్యక్తి, సాహిత్యంపై గొప్ప అవగాహన ఉంది. షూటింగ్‌కి వచ్చినప్పుడు ఎలాంటి అలసట లేకుండా అదే ఎనర్జీతో పని చేస్తారు అని తెలిపారు.
ఈ సినిమా పనులు పవన్ కల్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు నుంచే ప్రారంభమయ్యాయని నిధి చెప్పింది. ఎన్నికల సమయంలో కొంతకాలం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినా తిరిగి సెట్స్‌కి వచ్చినప్పుడు ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అదే ఉత్సాహం అదే కమిట్‌మెంట్‌తో పని చేస్తున్నారు. ఒక గొప్ప నాయకుడిగా, నటుడిగా ఆయన బాధ్యతలు సమర్థంగా నిర్వహించడం నాకు చాలా ఇష్టం అని వివరించారు.
ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ గురించి చెబుతూ నిధి అగర్వాల్ ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. అయితే నేను ఇందులో దెయ్యం పాత్రలో లేను. నా క్యారెక్టర్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఈ సినిమా వినోదాత్మకంగా సాగుతుంది. ప్రభాస్ గారు చాలా సరదాగా ఉంటారు. షూటింగ్ సమయంలో ఆయన అందరినీ నవ్విస్తూ సెట్‌లో స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తారు అని చెప్పింది.
ప్రస్తుతం నిధి అగర్వాల్ ఈ రెండు భారీ చిత్రాలతో బిజీగా ఉంది. హరి హర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీటి గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.