సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి పండగకు విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం జీ 5 ఓటీటీ వేదికలో ప్రసారం అవుతోంది.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ గతంలో రామానాయుడు, త్రివిక్రమరావు, వడ్డే రమేశ్ వంటి ప్రముఖ నిర్మాతలు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మించేవారని అలానే ప్రస్తుత కాలంలో దిల్ రాజు, శిరీష్ లాంటి నిర్మాతలు కూడా మంచి కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మొత్తం అనిల్ రావిపూడిదే అని పేర్కొన్నారు. వెంకటేశ్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడని ఆయన కెరీర్‌లో ఇది మరో మైలురాయి అని అభిప్రాయపడ్డారు.
ఈ కథలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త కిడ్నాప్ అయిపోతే హీరో అతడిని ఎలా రక్షించాడన్నదే ప్రధాన అంశమని చిన్న కథను వినోదాత్మకంగా, ఆకర్షణీయంగా మలిచిన తీరు అభినందనీయమని అన్నారు. చిరంజీవి లేదా బాలకృష్ణలు ఈ సినిమా చేసుంటే స్క్రీన్‌ప్లే మరో విధంగా ఉండేదని అయితే వెంకటేశ్ స్టైల్‌కు అనుగుణంగా అనిల్ రావిపూడి సినిమా తీర్చిదిద్దిన విధానం ఆసక్తికరంగా ఉందని చెప్పుకొచ్చారు.
సినిమాలోని ఉప కథల గురించి కూడా పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. కథలో హీరో ప్రేమకథ, ఉపాధ్యాయుడి జీవితం వంటి అంశాలను వినోదభరితంగా మలిచారని, దీనికి వెంకటేశ్ మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యేలా పాత్రను పోషించాడని చెప్పారు. బాలనటుడు వెంకటేశ్ కుమారుడిగా నటించిన తీరు ఆకర్షణీయంగా ఉందని అలాగే సాయి కుమార్ తన శైలి డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని అన్నారు.
కథలో ఓ బాలుడు త్రివర్ణ పతాకాన్ని సరిచేయడాన్ని చూపించడం ఎంతో గొప్ప విషయం అని జాతీయ జెండాపై అవగాహన కలిగించేలా ఓ మంచి సందేశాన్ని అందించిన అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ అని ప్రశంసించారు. ఇంటర్వెల్ భాగాన్ని వినోదాత్మకంగా మలచడం, చివర్లో కథ నడుస్తున్నపుడే అనూహ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌ను జోడించడం ఆకట్టుకునే అంశాలని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని చూస్తే అనిల్ రావిపూడి దర్శకత్వ శైలి జంధ్యాల గారి హాస్యాన్ని గుర్తు చేస్తుందని అన్నారు.