మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మీద సినీ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి రాజమౌళి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత వరకు ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. దాంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరుగుతోంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందన్న వార్త బయటకు వచ్చినా, చిత్ర బృందం దీనిపై అధికారికంగా ఏమాత్రం స్పందించలేదు. అయితే సినిమా వర్గాల ద్వారా కొన్ని వివరాలు ఒక్కొకటిగా బయటకు వస్తూనే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఆయన రుద్ర అనే పాత్రలో కనిపించనున్నాడట. ఇది మహేష్ పాత్రకు పెట్టిన పేరు అని సమాచారం.
మహేష్ బాబు సినిమాల్లో టైటిల్ ప్రత్యేకమైనదైతే ఆయా చిత్రాల్లో ఆయన పాత్రలకు ఇచ్చే పేర్లు కూడా ప్రత్యేకత కలిగి ఉంటాయి. గుంటూరు కారంలో రమణ, ఖలేజాలో సీతారామరాజు, అతడులో పార్థు, పోకిరిలో పండు ఇలా ప్రతి సినిమాలో ఆయా పాత్రలకు కొత్తగా గుర్తుండిపోయేలా పేర్లు పెడతారు. ఇప్పుడు రుద్ర అనే పేరు కూడా అభిమానులకు చాలా కొత్తగా, పవర్‌ఫుల్‌గా అనిపిస్తోంది.
ఇటీవల హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 12 రోజుల పాటు షూటింగ్ జరిగింది. అక్కడ ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. ఈ షూటింగ్‌లో మహేష్ బాబుతో పాటు ప్రియాంకా చోప్రా, నానా పటేకర్ పాల్గొన్నారని తెలిసింది. నానా పటేకర్ ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
తాజాగా కొత్త షెడ్యూల్ ఒడిశాలో ప్రారంభమైనట్లు సమాచారం. అక్కడ మరో 15 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఈ సినిమాకు గరుడ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. కానీ ఇది పాన్ వరల్డ్ సినిమా కావడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునేలా ఒక ఇంగ్లీష్ టైటిల్ కోసం చిత్ర బృందం ఆలోచిస్తోందని సమాచారం.