ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ టాలెంట్‌కు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బాలీవుడ్‌ను వదిలివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా తాను ఇబ్బంది పడుతున్నానని, ఇకపై బాలీవుడ్‌కు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నానని తెలిపారు.
తాజాగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ బాక్సాఫీస్ లెక్కలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ రూ. 500 కోట్లు, రూ. 800 కోట్లు వసూలు చేసేలా సినిమాలు రూపొందిస్తున్నారు. అసలు సినిమాకు సృజనాత్మకతే లేకుండా పోతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటి పరిస్థితులు తనను తీవ్రంగా నిరాశకు గురిచేశాయని సినీ నిర్మాణం ఆరంభించే సమయంలోనే ఎంత వసూళ్లు సాధించగలమనే కోణంలో నిర్మాతలు ఆలోచిస్తున్నారని చెప్పారు.
అనురాగ్ కశ్యప్ తన అనుభవాలను పంచుకుంటూ.. ఇది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, పూర్తిగా వ్యాపార లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. సినిమా ఆరంభించే ముందు నుంచే నిర్మాతలు లాభనష్టాల లెక్కలు వేస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల సినిమా రూపొందించే ఆనందం పూర్తిగా పోయిందని వాపోయారు.
తాను త్వరలో ముంబైని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోతానని అనురాగ్ కశ్యప్ స్పష్టం చేశారు. బాలీవుడ్‌కి చెందిన వారందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెంగళూరుకు షిఫ్ట్ కానున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి.