దేనికైనా ఓ సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు చేయాల్సిన పనైనా, అనాల్సిన మాటైనా ఇచ్చిపడేయాల్సిందే. అదే చేస్తున్నాడు అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తన సినిమాలపై కామెంట్స్ చేసిన వారందరికీ సమయం వచ్చిన ప్రతిసారి బదులిస్తూనే ఉన్నాడు.
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల రిలీజ్ అయిన సమయంలో వచ్చిన కామెంట్స్, విమర్శలకి ఇప్పుడు సమాధానమిస్తున్నాడు. ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకుని మరీ, కౌంటర్స్ ఇస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ని టార్గెట్ చేశాడు. సినిమా విడుదల సమయంలో, ఇలాంటి సినిమాలకు డబ్బులు రావచ్చేమో కానీ, సామాజిక విలువలు నశించిపోతున్నాయంటూ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు సందీప్.
ఒక ఐఏఎస్ అధికారి నా సినిమాపై అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధనిపించింది. ఆయన అనవసరంగా నా సినిమాపై విమర్శలు చేశాడు. సినిమా మేకింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటున్నాడు. ఆ సమయంలో చాలా కోపం వచ్చింది కానీ, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నాను.. రెండు మూడేళ్లు ఓ 1500 పుస్తకాలు తిరగేస్తే ఐఏఎస్ అయిపోవచ్చు. కానీ ఫిల్మ్ మేకర్ లేదంటే రచయిత కావాలంటే అంత ఈజీ మాత్రం కాదు. అందుకు ఎలాంటి కోర్సులు లేవు. కావాలంటే రాసిస్తాను.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం సందీప్ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.