మ్యాడ్ స్క్వేర్ సినిమా విడుదల ఒక రోజు ముందుకు వచ్చేసింది. మార్చి 29 శనివారం ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ రోజు అమావాస్య కావడంతో మేకర్స్ ఒక రోజు ముందుగానే అంటే, మార్చి 28 శుక్రవారమే సినిమాను విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. దీంతో మార్చి 28 బాక్సాఫీస్ వద్ద మంచి కాంపిటేషన్ ఉండబోతుంది. అదే రోజున హరి హర వీరమల్లు, రాబిన్‌హుడ్ చిత్రాలు రిలీజ్‌కు ఉన్నాయి.
అయితే వీటిలో హరి హర వీరమల్లు సినిమా విడుదల డౌట్‌లో ఉంది. ఇంకా చిత్రీకరణ మిగిలి ఉండటంతో, ఆ సినిమా కచ్చితంగా ఈ డేట్‌కి రాదని మ్యాడ్ స్క్వేర్ మేకర్స్ ఫిక్సయ్యారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ సినిమా ఆ తేదీకి వస్తే, మా సినిమాను మరో తేదీకి వాయిదా వేసుకుంటామని నిర్మాత నాగవంశీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎలాగూ ఆ సినిమా రాదని క్లారిటీ వచ్చేయడంతో పాటు, అమావాస్య కూడా కలిసి వచ్చి, ఒక రోజు ముందుగానే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఫిక్సయ్యారు.
ఈ ప్రీ పోన్‌పై నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. మా పంపిణీదారుల అభ్యర్థన, సపోర్ట్‌తో ఒక రోజు ముందుగా మార్చి 28వ తేదీనే మ్యాడ్ స్వ్కేర్‌ను థియేటర్లలోకి తీసుకు వస్తున్నాం. చివరి నిమిషంలో విడుదల తేదీ మార్చడానికి కారణం, మార్చి 29న అమావాస్య కావడమే. దీంతో పంపిణీదారులందరూ విడుదలను ముందుకు తీసుకెళ్లడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయం పట్ల మేము కూడా ఏకీభవించాము. మా సినిమాతో పాటు విడుదలవుతున్న రాబిన్‌హుడ్ సినిమా కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు.