జ్యోతిక సినీ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె డబ్బా కార్టెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాది సినీ పరిశ్రమలో తన అనుభవాలను పంచుకున్నారు. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
నేను 28 ఏళ్ల వయసులోనే తల్లిని అయ్యాను. అయినప్పటికీ, నేను విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో నటిస్తూ వచ్చాను. కానీ ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో సరసన నటించే అవకాశం మాత్రం రాలేదు. కొత్త దర్శకులతో కలిసి పని చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఒకప్పుడు కె. బాలచందర్ గారి వంటి ప్రముఖ దర్శకులు, పెద్ద నిర్మాణ సంస్థలు మహిళా ప్రాధాన్య చిత్రాలను తెరపైకి తీసుకువచ్చేవారు.
కానీ ఇప్పటి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పుడు స్టార్ హీరోల చుట్టూ తిరిగే కథలే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. మహిళా ప్రధాన చిత్రాలకు ఆసక్తి చూపే నిర్మాతలు, దర్శకులు తగ్గిపోయారు. దీనికి బడ్జెట్ ఒక ప్రధాన కారణం, అలాగే వయస్సు కూడా మరో అవరోధంగా మారింది. దక్షిణాదిలో మహిళా నటిగా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ సొంతంగా పోరాడాల్సిన పరిస్థితి ఉంటుందని జ్యోతిక వెల్లడించారు.
జ్యోతిక 1997లో డోలీ సజాకే రఖ్నా అనే చిత్రంతో సినీరంగంలో అడుగు పెట్టారు. 2003లో వచ్చిన ఠాగూర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 2006లో నటుడు సూర్యను వివాహం చేసుకున్న ఆమె అతనితో కలిసి ఏడు సినిమాల్లో నటించారు. ప్రస్తుతానికి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో కొనసాగుతున్నారు.