పుష్ప 2 అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడో అనే ఆసక్తి ఫ్యాన్స్, సినీ వర్గాల్లో పెరుగుతోంది. మొదట ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కొంత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్ మరో భారీ చిత్రాన్ని మొదలుపెట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీతో కలిసి పని చేసే అవకాశం దాదాపు ఖరారైనట్లు సమాచారం.
సౌత్ సినిమాలతో పేరు తెచ్చుకున్న అట్లీ బాలీవుడ్‌లో జవాన్ ద్వారా భారీ విజయాన్ని అందుకున్నాడు. షారుఖ్‌ఖాన్‌తో చేసిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ వసూళ్లను సాధించడంతో అట్లీకి నేషనల్ లెవెల్‌లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు అతడు అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఈ సినిమా బడ్జెట్ విషయంలో మేకర్స్ ఎలాంటి రాజీ పడకుండా అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్. సినిమాకు సంబంధించి మొత్తం ఖర్చు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల దాకా ఉండొచ్చని సమాచారం. అంతేకాదు అల్లు అర్జున్ ఈ సినిమాకు ఏకంగా రూ.250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. ఇప్పటి వరకు నేషనల్ లెవెల్‌లో అత్యధిక రెమ్యునరేషన్ ప్రభాస్‌కు మాత్రమే ఉన్నా ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసినట్లయ్యింది.
అల్లు అర్జున్ మాత్రమే కాదు అట్లీ కూడా ఈ సినిమాకు భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అట్లీకి అందుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే మొత్తం బడ్జెట్‌లో సగం ఖర్చు రెమ్యునరేషన్‌కే వెళ్తుందని అర్థం. ఇక ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో చిత్ర బృందం ప్రస్తుతం బిజీగా ఉంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడని టాక్. జవాన్ తరహాలో హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారని సమాచారం. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అట్లీ అల్లు అర్జున్ మూవీ నిజంగా ఇండస్ట్రీ రికార్డ్స్ సెట్ చేస్తుందా వేచి చూడాలి.