ఫిబ్రవరి ముగిసి మార్చి వచ్చేసింది. వాస్తవానికి మేకర్స్ చెబుతున్న ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రానికి ఇంకా 27 రోజులు మాత్రమే సమయం ఉంది. కానీ షూటింగ్ పూర్తికావడానికి ఇంకా కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉన్నట్లే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మరో నాలుగు లేదా ఐదు రోజుల షెడ్యూల్ కేటాయిస్తే చిత్రీకరణ పూర్తయ్యే అవకాశముందని టాక్. కానీ ఆయన ఆరోగ్య కారణాలు, అసెంబ్లీ సమావేశాలు తదితర అంశాలు ఈ సినిమా షూటింగ్‌కు ఆటంకంగా మారాయి.
ఈ పరిస్థితుల్లో హరిహర వీరమల్లు ప్రకటించిన తేదీ అంటే మార్చి 28న విడుదల అవుతుందా? అన్నది సందేహంగా మారింది. అందుకే అదే రోజుకు ఫిక్స్ అయిన నితిన్ రాబిన్ హుడ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మ్యాడ్ స్క్వేర్ సినిమాల ప్రొమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి.
ఒకవేళ ఈ సినిమా మార్చిలో విడుదల కాకపోతే ఏప్రిల్ 11 లేదా 18 తేదీలను పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే అనుష్క నటించిన ఘాటీ కనుక సినిమా మూడో వారానికి వాయిదా పడితే ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయడానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు హరిహర వీరమల్లు టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ పోస్ట్ పోన్ గురించి ఎటువంటి సంకేతాలు ఇవ్వడం లేదు.
ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రెండు లిరికల్ సాంగ్స్ మాత్రమే విడుదలయ్యాయి. అయితే అసలైన హైప్ పెంచే ట్రైలర్ ఎప్పుడొస్తుందనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ ఏప్రిల్ 11న రిలీజ్ చేయాలనుకుంటే ప్రమోషన్‌కు తగినంత సమయం మిగులుతుందా అన్నది సందేహమే.
ఈ సినిమా భారీగా ఓపెనింగ్ సాధించే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణ ప్రేక్షకులను ఆకర్షించడానికి మేకర్స్ మరింత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కీరవాణి అందించిన పాటలు బాగానే ఉన్నప్పటికీ ఆర్ఆర్ఆర్ స్థాయిలో లేవనే అభిప్రాయాలు వస్తున్నాయి. నిధి అగర్వాల్, బాబీ డియోల్, జయరామ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ హిస్టారికల్ డ్రామా పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.
సినిమా విడుదలపై ఎలాంటి మార్పులున్నా అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మార్చి 28నే విడుదల అనుకుంటే ప్రచార వ్యూహాన్ని మార్చుకోవాలి. లేదంటే వాయిదా పడటం ఖాయం అనే విషయాన్ని మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి. మరి హరిహర వీరమల్లు టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.