ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ పేరు ముందు వరుసలో నిలుస్తోంది. ఖైదీ, విక్రమ్ సినిమాలతో అతను సాధించిన ఘనత ఏంటనేది చెప్పక్కర్లేదు. తన సినిమాలకు యూనిక్ స్టైల్ అందిస్తూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా ఒక ట్రెండ్‌ను సృష్టించాడు. అయితే అంత క్రేజ్ సంపాదించిన లోకేష్ తన తొలి చిత్రంలో యంగ్ హీరో సందీప్ కిషన్‌ను లీడ్ రోల్‌లో పెట్టాడు. ఆ సినిమా పేరు మా నగరం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
మా నగరం తర్వాత సందీప్ కిషన్ లోకేష్ కనగరాజ్ ఇద్దరూ కలిసి మరే చిత్రంలో పని చేయలేదు. ఎల్సీయూలో వచ్చిన చిత్రాల్లో సందీప్ కనపడలేదు. ఈ విషయాన్ని తాజాగా మజాకా సినిమా సక్సెస్ మీట్‌లో విలేకరులు ప్రశ్నించగా సందీప్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
ప్రస్తుతం లోకేష్‌తో టచ్‌లోనే ఉన్నానని చెప్పాడు సందీప్. కానీ మళ్లీ కలిసి సినిమా చేయాలంటే అది ఇద్దరికీ బెస్ట్ మూవీ అయ్యుండాలని భావించామని చెప్పాడు. కాబట్టి ఇప్పటివరకు ఇద్దరూ మళ్లీ కలవలేదు. కానీ భవిష్యత్తులో ఇద్దరం కలిసి పని చేయనున్నట్లు హింట్ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఎల్సీయూలో భాగమా కాదా అన్నది చెప్పలేనని సందీప్ చెప్పడం గమనార్హం.
లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి సందీప్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. షూటింగ్ స్పాట్‌కి వెళ్లిన సందీప్ దాదాపు ముప్పావు గంట పాటు సినిమా చూశానని చెప్పాడు. ఈ సినిమా కనీసం వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. అంతేకాదు కన్నడ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే అందాల భామ పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.
లోకేష్ కనగరాజ్ తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు. సందీప్‌తో తొలి సినిమా తీసినప్పటికీ తర్వాత ఇద్దరూ కలిసి పని చేయలేదు. కానీ భవిష్యత్తులో మళ్లీ జోడీ కట్టే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు. మరో వైపు కూలీ సినిమా గురించి సందీప్ చేసిన కామెంట్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.