బాలీవుడ్ స్టార్ హీరోలు సినిమా బడ్జెట్ కి మించి పారితోషికాలు అందుకుంటారనే టాక్ ఉంది. ఒక్కో హీరో కోట్లలో పారితోషికాలు పుచ్చుకుంటారు, నిర్మాతలు కూడా వారి క్రేజ్ చూసి పెద్ద మొత్తం ఆఫర్ చేస్తారు అనేది అందరికి తెలిసిందే. కానీ భారీ పారితోషికాలు బాలీవుడ్ కొంప ముంచుతున్నాయంటూ ఇప్పుడొక బాలీవుడ్ స్టార్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యి కూర్చున్నాయి.
వరస సినిమాలో బిజీగా వున్న జాన్ అబ్రహం తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు సమాధానం చెప్పారు. బాలీవుడ్ తారలు కొందరు రోజుకి కోట్లలో పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారా అని అడగగా.. దానికి భారీ పారితోషికాలు అంటే నవ్వొస్తుంది. ఆ భారీ రెమ్యునరేషన్స్ ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్ ని దెబ్బతీశాయి. భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించే సినిమాలపై నటుల భారీ పారితోషకాలు ఇంకాస్త ఒత్తిడిని పెంచుతున్నాయి.
అసలు అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది, నటులు నిజంగానే డిమాండ్ చేస్తున్నారా లేదంటే ఏజెంట్స్ ఇలాంటివి వ్యాప్తి చేస్తున్నారా, నటులు డిమాండ్ చెయ్యడమే కాదు, కొంతమంది నిర్మాతలు కూడా భారీగా నటులకు ఆశ చూపిస్తున్నారు. ఎంతంటే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దాని వల్ల ఇండస్ట్రీకి నష్టమే కానీ లాభముండదు. ఒక నటుడిగా ఇలాంటివి వినడానికి బాధపడుతున్నా అంటూ పారితోషికాలపై జాన్ అబ్రహం రియాక్ట్ అయ్యారు.