సందీప్ రెడ్డి వంగ పేరు వినగానే బాలీవుడ్ లో కొంతమంది టెన్షన్ పడడం ఖాయం. ఆయన తెరకెక్కించే సినిమాలు ఆయన స్టేట్‌మెంట్లు బాలీవుడ్ సినీ వర్గాలను కుదిపేస్తూనే ఉంటాయి. అర్జున్ రెడ్డి వంటి సంచలన హిట్ తర్వాత అదే కథను కబీర్ సింగ్ గా హిందీలో తెరకెక్కించి అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ అందుకున్న సందీప్ కొన్ని వర్గాల విమర్శల పాలయ్యారు. పురుషాధిక్యతను ప్రోత్సహించాడని కథలో సమస్యలు ఉన్నాయని చాలా మంది బాలీవుడ్ క్రిటిక్స్ విమర్శలు చేశారు. కానీ బాలీవుడ్ లో ఇదే తరహా కథలు ఎన్నో వచ్చినా ప్రత్యేకంగా కబీర్ సింగ్ మాత్రమే టార్గెట్ కావడం అనేక అనుమానాలను రేకెత్తించింది.
యానిమల్ సినిమా విషయంలోనూ సందీప్ రెడ్డి బాలీవుడ్ విమర్శకుల నుంచి ఇదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ సహా అనేక మంది ఈ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే సందీప్ మాత్రం విమర్శలకు తలొగ్గకుండా తన సినిమాల వసూళ్లతోనే కాకుండా ఇంటర్వ్యూల్లో ఇచ్చే కౌంటర్లతో బాలీవుడ్ హిపోక్రసీని ఎండగట్టారు.
తాజాగా కోమల్ నహతా అనే బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో కబీర్ సింగ్ లో నటించాడనే కారణంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఓ నటుడిని తన సినిమాలోకి తీసుకోవడానికి నిరాకరించింది అని సందీప్ వెల్లడించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ కరణ్ జోహార్ సంస్థేనని అందుకు గురైన నటుడు సోహమ్ మజుందార్ అని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అంతేకాదు యానిమల్ విషయంలో నా పని తప్పుగా ఉంటే అదే సినిమాలో రణబీర్ నటనను మాత్రం అందరూ పొగిడేస్తున్నారు. ఇది హిపోక్రసీ కాదా అంటూ సందీప్ బాలీవుడ్ విమర్శకులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సందీప్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రోమోతోనే హాట్ టాపిక్‌గా మారిన ఈ ఇంటర్వ్యూ పూర్తి ఎపిసోడ్ లో ఇంకెన్ని షాకింగ్ రివిలేషన్స్ ఉంటాయో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.