తన తాజా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ప్రమోషన్లో భాగంగా జ్యోతిక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, సినిమాల ఎంపిక గురించి, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
సినీ ప్రయాణం ఎలా సాగుతోంది అన్న ప్రశ్నకు జ్యోతిక మాట్లాడుతూ.. నాకు నా సినీ కెరీర్‌పై ఎప్పుడూ అసంతృప్తి అనిపించలేదు. ప్రేక్షకులు నన్ను స్వీకరించడంతో పాటు ప్రతి సినిమాలో కొత్త పాత్రలు చేయడం నాకు సంతృప్తినిస్తోంది. మంచి సినిమాలను గుణాత్మకమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాను. ప్రతి పాత్ర కూడా నా నటనా ప్రయాణంలో ఒక కొత్త మైలురాయిగా నిలుస్తోంది అని చెప్పింది.
డబ్బా కార్టెల్ లో నటించడానికి కారణం గురించి జ్యోతిక మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్‌లో నటించడానికి తనను ఆకర్షించిన ముఖ్యమైన అంశం కథేనని జ్యోతిక చెప్పింది. ఈ కథ వినగానే నాకు తెగ ఇష్టం వచ్చేసింది. ఇందులో కంటెంట్‌కి అత్యంత ప్రాధాన్యత ఉంది. అంతే కాకుండా లెజెండరీ నటి షబానా అజ్మీ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా గొప్ప అనుభూతి. ఆమెతో కలిసి పనిచేయడం ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం నిజంగా గర్వించదగ్గ విషయం అని తెలిపింది.
మీ కెరీర్‌లో మీకు నచ్చిన సినిమాలేంటి అని అడగగా.. జ్యోతిక తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మకమైన పాత్రలు పోషించిందని గుర్తుచేసుకుంటూ అందులో మోజి నా ఫేవరెట్ మూవీ. ఆ సినిమాలో నేను మాట్లాడలేని వినలేని అమ్మాయిగా నటించాను. అది నా కెరీర్‌లో గణనీయమైన చిత్రం. అలాగే న్యాయవాదిగా, ప్రిన్సిపాల్‌గా చేసిన పాత్రలు కూడా నాకు ఎంతో ప్రత్యేకం. ఇవన్నీ నా సినీ ప్రస్థానంలో కీలకమైన చిత్రాలు అని చెప్పింది.
బాలీవుడ్‌ని వదిలి కోలీవుడ్‌లో స్థిరపడటానికి కారణం ఏంటి అనే ప్రశ్నకు జ్యోతిక మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం బాలీవుడ్ నుంచే మొదలైందని, కానీ అక్కడ తన తొలి సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదని జ్యోతిక తెలిపింది. నాకు అక్కడ మంచి అవకాశాలు రాలేదు. అదే సమయంలో తమిళ చిత్రసీమలో ఛాన్స్ రావడంతో అక్కడ ప్రయత్నించాను. నా తొలి తమిళ చిత్రం నా భర్త సూర్యతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సినిమా విడుదలయ్యాక, అక్కడ వరుసగా మంచి అవకాశాలు రావడంతో కోలీవుడ్‌లో స్థిరపడిపోయాను అని వివరించింది.
ఇంట్లో ఇద్దరూ స్టార్‌లు.. మరి కుటుంబ జీవితం ఎలా అని అడగగా.. సూర్యతో కలిసి తన స్టార్ ఇమేజ్‌ను ఇంట్లోకి తీసుకురానని, అక్కడ తల్లిదండ్రులుగా మాత్రమే ఉంటామని జ్యోతిక తెలిపింది. ఇంటి బయట సినిమా తారలమే, కానీ ఇంట్లోకి అడుగుపెట్టగానే మేం సింపుల్ పెరెంట్స్. పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించేందుకు కృషి చేస్తాం. వాళ్ల స్కూల్, హోంవర్క్, భోజనం ఇవే మా దైనందిన జీవితంలో ముఖ్యమైనవి అని చెప్పింది.
హిందీలో అవకాశాలు రాకపోవడం బాధ కలిగించిందా అనే ప్రశ్నకు జ్యోతిక మాట్లాడుతూ.. ఈ విషయమై నాకు ఏ మాత్రం బాధ లేదూ. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో గొప్ప పాత్రలు పోషించాను. హిందీలో ఎక్కువ అవకాశాలు వచ్చినుంటే, కోలీవుడ్‌లో నాకు లభించిన గొప్ప పాత్రలను చేయలేకపోతును. కానీ 27 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో ఛాన్స్ రావడం ఆనందంగా ఉంది. అక్కడి ప్రేక్షకులు కూడా నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉంది అని జ్యోతిక ధీమాగా చెప్పింది.