సార్ తర్వాత ధనుష్ నటిస్తున్న తెలుగు సినిమా కుబేర ఎప్పుడు విడుదల అవుతుందో అభిమానులకు ఇంకా స్పష్టత రావడం లేదు. నాగ చైతన్య నటించిన తండేల్ మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు నాగార్జున తన కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో కుబేర ఆ లోటును భర్తీ చేస్తుందనే ఆశాభావం అభిమానుల్లో ఉంది. కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల తన చిత్రాల్లో పర్ఫెక్షన్ కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకునే వ్యక్తి. తాను అనుకున్న స్థాయిలో సినిమా రాకపోతే రాజీ పడరు. ఈ కారణంగానే కుబేర షూటింగ్ ఆలస్యం అవుతోందనే అభిప్రాయాలు మొదటి నుంచి ఉన్నాయి.
ఇదిలా ఉండగా ధనుష్ ఈ సినిమాపై ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం మరో అస్పష్టతను పెంచుతోంది. కుబేర విడుదల తేదీపై సందిగ్ధంలో ఉండగానే ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో ఇడ్లి కడాయ్ అనే సినిమా పూర్తి చేసేశాడు. అంతేకాకుండా బాలీవుడ్ లో తేరి మేరీ ఇష్క్ మే అనే సినిమాలో నటించేందుకు బిజీగా మారిపోయాడు. దీంతో కుబేర ఏ దశలో ఉందో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈలోగా కుబేర సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంది. నరేందర్ అనే నిర్మాత ఇటీవల హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి ఈ టైటిల్‌ను తాము 2023లోనే రిజిస్టర్ చేసుకున్నామని పేర్కొంటూ వివాదం రేపారు. గతంలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకూ ఇలాంటి సమస్యే వచ్చిందని సినీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే కుబేర విషయంలో కూడా త్వరలోనే ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక విడుదల విషయానికి వస్తే మార్చిలో సినిమాను విడుదల చేసే అవకాశం లేదు. ఏప్రిల్ నెలలో ఇప్పటికే పలు భారీ చిత్రాలు రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. జాక్, ఘాటీ, గుడ్ బ్యాడ్ అగ్లీ, కన్నప్ప వంటి పాన్ ఇండియా సినిమాలు వరుసలో ఉన్నాయి. మే నెలలో రిలీజ్ ప్లాన్ చేసినా ఇప్పుడే అధికారికంగా ప్రకటిస్తే అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతుంది. జూన్ లో చిరంజీవి విశ్వంభర రవితేజ మాస్ జాతర వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డబ్బు నేపథ్యంలో నడిచే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది. కమ్ముల మార్క్ ట్రీట్‌మెంట్‌ను ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా చూపించనున్నారట. సినిమా ఆలస్యమైనా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందో తెలియక అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కుబేర తర్వాత శేఖర్ కమ్ముల నాని కాంబినేషన్‌లో ఓ సినిమా చేయాలని ప్లాన్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.