కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ పై ఈడీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎంథిరన్ (Robo) సినిమా సంబంధిత కాపీరైట్ ఉల్లంఘన కేసులో శంకర్‌కు చెందిన సుమారు రూ.10 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను అటాచ్ చేసింది. ఈ చర్యలపై తాజాగా శంకర్ మౌనం వీడి స్పందించారు. కోర్టు ఇప్పటికే తీర్పునిచ్చినప్పటికీ ఈడీ తీసుకున్న నిర్ణయం తనను ఎంతగానో బాధించిందని తెలిపారు.
ఈడీ చెన్నై జోనల్ కార్యాలయం తీసుకున్న నిర్ణయంపై తన మనసులో ఉన్న విషయాలను బయటపెట్టాలనుకుంటున్నానని శంకర్ అన్నారు. ఎంథిరన్ చిత్రానికి సంబంధించి నిరాధారమైన ఆరోపణలతో తనకు చెందిన మూడు స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేయడం అన్యాయమని చెప్పారు. న్యాయపరంగా ఈ కేసు ఇప్పటికే విచారణకు వెళ్లి తాను ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘన చేయలేదని కోర్టు స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడటం తాను అంగీకరించలేనని అన్నారు.
ఎంథిరన్ సినిమాకు సంబంధించి అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి తన కథ జిగుబాను కాపీ కొట్టి శంకర్ సినిమా తీశారంటూ కోర్టులో కేసు వేశారు. కానీ హైకోర్టు దీనిపై విచారణ జరిపి అసలైన హక్కులు శంకర్‌కే ఉన్నాయంటూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనూ తన ఆస్తులను అటాచ్ చేయడం తప్పని న్యాయపరంగా అన్యాయమని శంకర్ అభిప్రాయపడ్డారు.
ఈ కేసుకు సంబంధించి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక కూడా శంకర్‌కు వ్యతిరేకంగా వెళ్లింది. జిగుబా కథతో ఎంథిరన్ సినిమాకు చాలా పోలికలున్నాయని శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆ నివేదికలో పేర్కొంది. దీనిని ఆధారంగా చేసుకుని ఈడీ చర్యలు తీసుకుందని తెలుస్తోంది. అయితే న్యాయస్థానం ఇప్పటికే తీర్పు ఇచ్చినప్పటికీ ఈడీ తాజా చర్యలపై శంకర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.