దేశవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్నట్లే టాలీవుడ్‌లో కూడా రెమ్యూనిరేషన్‌లు భారీగా పెరుగుతున్నాయి. హిట్ డైరెక్టర్లు టాప్ హీరోల పారితోషికం కొత్త రేంజ్‌కి చేరుతోంది. వరుస విజయాల వల్ల రెమ్యూనిరేషన్‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అఖండ సినిమా సమయంలో నందమూరి బాలకృష్ణ రెమ్యూనిరేషన్ 8 కోట్లు అని టాక్. కానీ ఇప్పుడు అదే పారితోషికం 38 కోట్లకు చేరిందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య వరుసగా హిట్లు కొట్టడం మార్కెట్ విస్తరించడంతో రెమ్యూనిరేషన్ భారీగా పెరిగిందని చెప్పాలి.
ఇక బోయపాటి శ్రీను క్రేజ్ కూడా తగ్గడం లేదు. అఖండ తర్వాత స్కంధ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా అఖండ 2 సినిమాకు ఆయన రెమ్యూనిరేషన్ ఏకంగా 35 కోట్లు అని సమాచారం. బాలయ్య బోయపాటి కాంబినేషన్‌కు ఉన్న మాస్ క్రేజ్ కారణంగా ఈ పారితోషికం భారీగా పెరిగిందని అంటున్నారు. అఖండ సీక్వెల్ కావడం కూడా సినిమాపై హైప్ పెంచే అంశంగా మారింది.
ఇక ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ విషయాన్ని చూస్తే బాలయ్య, బోయపాటి, సంగీత దర్శకుడు థమన్, సినిమాటోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రాఫర్‌ల రెమ్యూనిరేషన్‌లకే 80 కోట్లకు పైగా ఖర్చవ్వనుందని అంచనా. బోయపాటి సినిమాల్లో గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్ తప్పనిసరి. వాటికి కనీసం 10 కోట్ల పైగా ఖర్చు అవుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తం మీద అఖండ 2 బడ్జెట్ దాదాపు 180 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రింటింగ్ ప్రచార ఖర్చులు కలుపుకుంటే మొత్తం ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ మార్కెట్ ద్వారా 200 కోట్ల వరకు వసూలైతే నిర్మాతలు మంచి లాభాల్లో ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.